తిర్యాణి, ఏప్రిల్ 6 : ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆ మారుమూల గ్రామాల గిరిజనం తాగు నీటికి తండ్లాడుతున్నది. కొన్నిచోట్ల బోర్వెల్లు పాడైపోగా, మరికొన్ని చోట్ల బావులు అడుగంటి అష్టకష్టాలు పడుతున్నది. గుక్కెడు నీటికోసం పనులన్నీ వదులుకొని.. నిద్రాహారాలు మాని వాగులు.. వంకల వెంట పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొన్నది.
పనిచేయని బోర్వెల్లు.. అడుగంటిని బావులు..
తిర్యాణి మండలం గుండాల, మంగీ, తొక్కిగూడ, తాటిగూడ, గోపెర, లంబాడీతండా, గోవెన, కొలాంగూడ, కుర్సుగూడ, భీంరాళ్ల, బందర్గూడ, మొర్రిగూడ, లోహ, తోయరేటి, మగర్మోడీ, దోంగుర్గాం, బోర్ధం తదితర గ్రామాల్లో తాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. పలుచోట్ల బోరుబావులు పాడైపోగా.. మరికొన్ని చోట్ల చేదబావుల్లో నీరు మొత్తం ఇంకిపోయింది. ఇక మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ నిర్వహణ లేక.. పైపులైన్లకు మరమ్మతులు చేయక తాగు నీరు సరఫరా కావడం లేదు. దీంతో ఇంటి అవసరాలకు తాగు నీటికి గిరిజనులు అవస్థలు పడుతున్నారు.
కొందరు ఎడ్లబండ్లు కొట్టుకొని స్థానిక వాగుల్లో చెలిమెలు తోడుకొని నీరు తెచ్చుకుంటుండగా, మరికొందరు కిలోమీటర్ల కొద్ది కాలినడకన వెళ్లి బిందెల్లో నీరు మోసుకొస్తున్నారు. పనులన్నీ వదులుకొని చిన్నా పెద్దా తేడా లేకుండా నీటికోసం వేట సాగించాల్సి వస్తున్నది. ప్రస్తుతం ఎండలు కూడా ముదరడంతో వాగుల్లో ఊట తగ్గి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
చెలిమెలు తోడుకొని ఊట వచ్చేదాకా ఎదురుచూడాల్సి వస్తున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో మురుగు నీటిని కూడా తాగాల్సి వస్తున్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మూగజీవాలకు సైతం తాగు నీటికి అల్లాడుతున్నాయని వాపోతున్నారు. తమ ఇబ్బందులను అధికారులు పట్టించుకున్న పాపాన పో వడం లేదని, ఇకనైనా స్పందించి త మ గోస తీర్చాలని వేడుకుంటున్నారు.
నాలుగైదు కిలోమీటర్లు నడుస్తున్నం
మా ఊరోళ్లంతా తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. మా ఊరిలో బోర్వెల్ లేదు. పక్కనున్న నాయకపుగూడలో ఒకే ఒక్క బావి ఉంది. అక్కడికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నం. గోండుగూడ, కొలాంగూడ గ్రామస్తులు కూడా అక్కడికే వస్తుండడంతో తాగు నీరు సరిపోవడం లేదు. దీంతో నాలుగైదు కిలో మీటర్ల దూరంలోని వాగుకు వెళ్లి చెలిమెలు తోడుకొని నీరు తెచ్చుకోవాల్సి వస్తున్నది.
పనులన్నీ వదులుకొని.. తిండీ తిప్పలు.. నిద్రాహారాలు మాని తాగు నీటి కోసం తండ్లాడుతున్నాం. ఇప్పుడు ఎండలు కూడా ముదిరినయి. ఇంకొన్ని రోజులు పోతే ఆ చెలిమెల నీరు కూడా దొరికేలా లేవు. ఇగ మేమంతా ఎట్లా బతకడం. ఇకనైనా అధికారులు స్పందించి తాగు నీటి గోస తీర్చాలి.
– కుడిమెత మారుబాయి. మొర్రిగూడ
లేవంగనే నీళ్లకు పోతున్నం
మా ఊరికి ఏడెనిమిది కిలో మీటర్ల దూరంలో వాగు ఉంది. లేవంగనే అక్కడికి పోయి చెలిమెల నీళ్లు తెచ్చుకుంటున్నం. పొద్దుగాల పోతనే నీళ్లు దొరుకుతయి. లేదంటే చెలిమెలో ఊట వచ్చేదాక ఆగాలి. రెండు మూడు గంటలు పడుతది. ఎడ్లబండ్లు లేనోళ్లు నెత్తిమోపుల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నరు. మా ఊర్లో ఉన్న బావి ఎండిపోయింది. మిషన్ భగీరథ ద్వారా కొన్ని రోజులు నీళ్లిచ్చిన్రు. ఇప్పుడు పైపులైన్లను బాగు చేసేటోళ్లు లేక నీళ్లస్తలేవు. ఎవరైనా వస్తే అన్నం పెట్టే పరిస్థితి ఉంది కానీ.. నీళ్లివ్వలేము. ఇకనైనా అధికారులు మాకు తాగు నీరందించాలి.
– సిడాం జగన్, భీంరాళ్ల