ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్( Asifabad) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ( Government Hospital ) లో అధికారుల నిర్లక్ష్యంతో తాగు నీటి కొరత ( Water Shortage ) ఏర్పడింది. రోగులకు తాగు నీరు లేక ఆసుపత్రిలో రోగులు, రోగి బంధువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో కేవలం గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట తాగు నీటి వసతి ఉండటంతో మూడో అంతస్తులో ఉన్న రోగులు కింది వచ్చి నీరు పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
అత్యవసరంగా తాగు నీరు కావలసిన వారు వాటర్ ప్లాంట్ సంబంధించిన మురికి నీరు వెళ్లే పైపుకు లీకేజీ ఉండటంతో నిమిషాల తరబడి అక్కడే నిలబడి లీకేజీ నుంచి నీటిని పట్టుకున్నారు. ఈ నీటిని తాగి అనారోగ్యం బారిన పడే అవకాశం లేకపోలేదని రోగులు వాపోతున్నారు. ఇప్పటికే వైరల్ ఫీవర్ కారణంగా ఆసుపత్రి రోగులతో నిండి ఉంది. ఇదే విషయమై ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన స్పందించలేదు.