ఖానాపూర్, మార్చి 29 : ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కుమ్రం భీం చౌరస్తా డబుల్ బెడ్రూం ఇళ్లవాసులు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. యేడాది కాలంగా ప్రజలు అధికారులకు విన్నవించినా స్పందించడం లేదు. నాలుగు రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్లలో ఏ, బీ, సీ బ్లాకులు ఉండగా.. 17 అపార్ట్మెంట్స్ పరిధిలో 400 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
దాదాపు 1500 మంది నివాసం ఉంటారు. కానీ.. వీరిలో కొందరికి సరిపడా బోర్లు, పైప్లైన్, ట్యాంకులు, మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వీరందరూ కూడా తాగు నీటి కోసం కిలోమీటరు దూరంలో ఉన్న బోరు బావి వద్దకు వెళ్లి తీసుకొచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి ప్రత్యేక ప్రణాళికను తయారు రూపొందించి తాగునీటి సమస్య నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.
కిలోమీటరు దూరం వెళ్తున్నా..
ఖానాపూర్ పట్టణ శివారులోని డబుల్ బెడ్రూం ఇళ్లలో తాగునీటి సదుపాయం సరిగ్గా లేదు. నీటి కోసం రోజు ఇబ్బందులు పడుతున్నాం. కాలనీలో ఏర్పాటు చేసిన బోర్లు సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో మేము కిలో మీటరు దూరంలో ఉన్న బోరింగ్లను ఆశ్రయిస్తున్నాం. ఇతర ప్రాంతల్లో ఉన్న బోరింగ్ల దగ్గరకు వెళ్లడానికి రోడ్డు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పాలనలో తాగునీటి కోసం అవస్థలు తప్పడం లేదు. మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిస్కరించాలని కోరుతున్నాం.
– అల్లెపు హన్మంతు, డబుల్ బెడ్రూం కాలనీ, ఖానాపూర్.
సమస్య తీవ్రంగా ఉంది
మున్సిపాలిటీ వాళ్లు తాగునీటిని సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మిషన్ భగీరథ నీరు నాలుగైదు రోజులకు ఒకసారి రావడంతో నీటికి కష్టంగా ఉంది. కిలో మీటరు దూరం నుంచి తాగునీటిని తీసుకొచ్చి పొదుపుగా వాడుకుంటున్నాం. నీరు సరిపోకపోవడంతో తప్పని సరి పరిస్థితిలో మంచినీటిని కొనుగోలు చేయాల్సి వస్తుంది. తాగు నీటి కష్టాలకు పెద్ద సార్లు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నా.
– చంద్రకళ, డబుల్ బెడ్రూం కాలనీ, ఖానాపూర్