పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల సాకారం చేయాలన్న తపనతో కేసీఆర్ మదిలో పురుడుపోసుకొన్న పథకమే డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం. కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పదేండ్ల పాలనలో లక్షలాది మందికి ఇండ్లు పంపిణీ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే కొందరికి అందగా.. మరికొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పలుచోట్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఇక పట్టాలు ఇవ్వడమే తరువాయి అనుకున్న తరుణంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ రేవంత్రెడ్డి చేసిన ప్రకటనకు తగ్గట్టుగానే రెండున్న రేండ్లుగా 2 బీహెచ్కే ఇండ్లను పంపిణీ చేయకుండా పక్కనపెట్టింది. నిర్మాణం పూర్తయి, నిర్వహణ లేక పాడైపోతున్నా చోద్యం చూస్తూ, ఎంపికైన లబ్ధిదారుల ఆశలు అడియాసలు చేసింది.
మంచిర్యాల, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం 10,650 ఇండ్లను మంజూరు చేసింది. వేలాది ఇండ్లను ఇప్పటికే లబ్ధిదారులకు అప్పగించినా, మరికొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వాటిని కాంగ్రెస్ సర్కారు పంపిణీ చేయకుండా, కేసీఆర్కు పేరు రావొద్దన్న దురుద్దేశంతో 2 బీహెచ్కేలను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నది. ఫలితంగా కొన్న శిథిలావస్థకు చేరుకోగా.. మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. పోనీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్నైనా అమలు చేస్తుందా? అంటే అదీ లేదు. హడావుడిగా పథకాన్ని ప్రవేశపెట్టి రోజుకో నిబంధన మారుస్తూ లబ్ధిదారులను ఇబ్బందులు పెడుతున్నది. 2014 మార్చి 24న మొదలైన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద, గతేడాది జూన్ 2వ తేదీన ఇందిరమ్మ తొలి విడుత ఇండ్లు పంపిణీ చేస్తామని సర్కారు చెప్పింది. పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయినా తొలి విడుతలో చేపట్టిన ఇండ్ల నిర్మాణ పనులే పూర్తి కాలేదు. బిల్లులు రావాలంటే కొర్రీలు పెట్టడం, సమయానికి పనులు కాకపోవడం, సాంకేతిక సమస్యలతో జనం అవస్థలు పడాల్సి వస్తున్నది. రాజకీయాలు పక్కన పెట్టి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
