నిర్మల్ చైన్‌గేట్, జూన్ 4 : నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక అవినాష్ ప్రతిష్టాత్మకమైన మిస్సెస్ వరల్డ్ పీస్ ఇంటర్నేషనల్-2024 అందాల పోటీల్లో కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక వృత్తిని, కుటుంబ బాధ్యతలను మోస్తూనే, తన చిరకాల కోరికైన అందాల పోటీల్లో పాల్గొంటున్నారు. గత నెలలో గ్లామర్ గుర్గావ్ సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొని ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. తాజాగా హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్లో మే 28 నుంచి జూన్ 1 వరకు నిర్వహించిన ఫైనల్స్ పోటీల్లో పాల్గొన్నారు. ఆమె 140 మంది పోటీదారులలో అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచి మిస్సెస్ ఇంటలెక్చువల్ సబ్ టైటిల్, మిస్సెస్ వరల్డ్ పీస్ కిరీటాన్ని అందుకున్నారు.
అందరి ప్రోత్సాహంతో అవార్డుకు ఎంపిక : చంద్రిక
డాక్టర్ చంద్రిక వైద్య వృత్తిలో రాణిస్తూనే అం దాల పోటీల్లో పాల్గొంటున్నారు. చంద్రిక భర్త డాక్టర్ అవినాష్ నిర్మల్ పట్టణంలో ప్రముఖ వైద్యుడు. భార్యాభర్తలు ఇద్దరూ వైద్య వృత్తి నిర్వహిస్తున్నారు. వీరికి పాప, బాబు ఉన్నా రు. భర్త ప్రోత్సాహం, అత్తగారు దేవీబాయి, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సోషల్ మీడి యా పాలోవర్స్కు ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. తన గురువు మెంటర్, గ్లామర్ గుర్గావ్ డైరెక్టర్ బార్ఖ నాంగియా ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అవార్డుకు ఎంపిక కావడంపై పలువురు ఆమెను అభినందించారు.