Cough | మనం సీజనల్ ఫ్లూ, అలెర్జీ, గొంతు ఇన్పెక్షన్, న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడినప్పుడు దగ్గు వస్తూ ఉంటుంది. మందులు వాడడం వల్ల లేదా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం దగ్గు నుండి ఉపశమనాన్ని పొందుతాం. ఇది మనందరం చేసేదే. అయితే కొన్నిసార్లు దగ్గు విపరీతంగా, ఎక్కువ కాలం పాటు ఉంటుంది. నిరంతర దగ్గు కొన్ని తీవ్రమైన సంకేతాలను కూడా ఇచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దగ్గు అనగానే మనం ఊపిరితిత్తుల సమస్యగా భావిస్తూ ఉంటాం. కానీ మొండిదగ్గు కొన్నిసార్లు గుండె సమస్యలను కూడా తెలియజేస్తుందని మొండి దగ్గుకు గుండెకు కూడా సంబంధం ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు.
దీర్ఘకాలిక దగ్గు గుండె వైఫల్యాన్ని సూచించే సంకేతాల్లో ఒకటి. గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు, గుండె కండరాలు గట్టిపడినప్పుడు ఇలా జరుగుతుంది. ముఖ్యంగా రుమాటిక్ గుండె జబ్బులతో బాధపడే వారిలో కూడా దీర్ఘకాలిక దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కొన్నిసార్లు గుండె రోగులకు సూచించే రామిప్రిల్ వంటి రక్తపోటు మందుల కారణంగా కూడా దగ్గు రావచ్చు. ఈ దగ్గును మందులు మార్చడం ద్వారా తగ్గించవచ్చు. ఇక దగ్గు మాత్రమే కాకుండా మన శరీరం చూపించే ఇతర సంకేతాలు కూడా గుండె సమస్యలను తెలియజేస్తాయి.
ఆకస్మికంగా కంటిచూపు తగ్గడం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు, చర్మంపై గజ్జి రావడం, చేతి వేళ్ల రంగు మారడం, జననేంద్రియ ప్రాంతంలో వాపు రావడం, ఆకస్మికంగా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా గుండె సమస్యలను తెలియజేస్తాయి. దృష్టిలోపం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడే వారిలో కన్స్ట్రిక్టివ్ పెరికార్డిటిస్ అనే గుండె సంబంధిత సమస్య ఉండే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
గుండె చుట్టూ పొర ఏర్పడి గుండె అంతర్గత ఒత్తిడిని పెంచడంతో పాటు గుండెలో ద్రవం పేరుకుపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక మరో స్పష్టమైన లక్షణం వేళ్లు నీలిరంగులోకి మారడం. ఇన్పెక్టివ్ ఎండోకార్డిటిస్ అనే గుండె సమస్య కారణంగా వేళ్లతో పాటు శరీరంలో వివిధ భాగాలు గడ్డకట్టడం వల్ల ఇలా జరుగుతుంది. కనుక దీర్ఘకాలం పాటు ఉండే దగ్గును సాధారణ దగ్గుగా భావించకపోవడం మంచిది. అలాగే దగ్గు వచ్చిన ప్రతిసారి ఊపిరితిత్తుల సమస్య అని కూడా భావించకూడదు. దీర్ఘకాలం పాటు తీవ్రమైన దగ్గు ఉండే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.