NTR | టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన పేరు, ఫోటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వినియోగిస్తూ డిజిటల్ దుర్వినియోగం చేయడంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్టీఆర్‌కు చెందిన పర్సనాలిటీ రైట్స్, పబ్లిసిటీ రైట్స్‌కు పూర్తి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా డిజిటల్ యుగంలో సెలబ్రిటీల హక్కులపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన పేరు, ఇమేజ్, ట్యాగ్‌లను సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్రకటనలు తదితర వేదికలపై అనధికారికంగా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారంటూ ఎన్టీఆర్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని సవివరంగా పరిశీలించిన కోర్టు, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా విస్తృత గుర్తింపు పొందిన ప్రముఖ నటుడని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆయన పేరు, గుర్తింపుకు స్పష్టమైన కమర్షియల్ విలువ ఉందని పేర్కొంది.
కోర్టు వ్యాఖ్యానిస్తూ, ప్రజలు ఎన్టీఆర్‌ను ఎన్టీఆర్, తారక్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు జూనియర్ అనే పేర్లతో పాటు యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ వంటి ట్యాగ్‌లతో కూడా గుర్తిస్తారని పేర్కొంది. ఈ పేర్లు, గుర్తింపులు అన్నీ ఆయన వ్యక్తిత్వంతో విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది.అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు, ఫోటోలు లేదా గుర్తింపును వాణిజ్య అవసరాల కోసం వినియోగించడం చట్ట విరుద్ధమని కోర్టు తేల్చిచెప్పింది. సోషల్ మీడియా లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి కంటెంట్ ఉన్నట్లయితే, వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ తరహా దుర్వినియోగం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ కేసులో మరో కీలక అంశంపై కూడా కోర్టు దృష్టి సారించింది. గుర్తుతెలియని వ్యక్తులు లేదా సంస్థలు ఎన్టీఆర్ పేరు లేదా ఇమేజ్ను ఉపయోగించి మోసాలకు పాల్పడినా, ఈ ఉత్తర్వులు వారికి కూడా వర్తిస్తాయని పేర్కొంది. ఎవరు అయినా ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తే లేదా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే, కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎన్టీఆర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చిన అంశాల్లో డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలు, అనుమతి లేని ప్రమోషన్లు వేగంగా పెరుగుతున్నాయన్నది ముఖ్యమైనది. ఇవి కేవలం ఆర్థిక నష్టాన్ని కలిగించడమే కాకుండా, నటుడి వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా తీవ్ర హానిని కలిగిస్తున్నాయని వారు వాదించారు. ఈ వాదనలను అంగీకరించిన కోర్టు, డిజిటల్ కాలంలో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులు అత్యంత విలువైనవని వ్యాఖ్యానించింది. ఒక ప్రముఖుడి పేరు, ఇమేజ్ కూడా వారి వ్యక్తిగత ఆస్తితో సమానమని స్పష్టం చేసింది.