మంచిర్యాల ఏసీసీ, జనవరి 18 : హెచ్ఐవీ (ఎయిడ్స్), సుఖ వ్యాధుల నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ జీ.సీ.సుబ్బారాయుడు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కూరగాయల మారెట్, బస్టాండ్ వద్ద జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శనను జెండా ఊపి ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ సుఖ వ్యాధులున్న వారికి హెచ్ఐవీ వ్యాధి సోకే అవకాశం ఎకువగా ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని, వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెమో వెంకటేశ్వర్లు, జిల్లా సూపర్ వైజర్ వీ.అనిల్‌కుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.