కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి ప్రవేశించిన పులి కెరమెరి, తిర్యాణితో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, ఉట్నూర్ అడవుల్లో సంచరిస్తున్నది. కెరమెరి మండలం జోడేఘాట్ రేంజ్‌పరిధిలో తిరుగుతున్నట్లు సోమవారం అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రెండు రోజులు క్రితం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం చాందూరి, హస్నాపూర్ ప్రాంతాల్లో పర్యటించిన పులి కెరమెరి రేంజ్ పరిధిలోకి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఆవాసం దొరకక..
దాదాపు మూడు నెలలుగా ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి ఆవాసం దొరకక సంచరిస్తున్నదని అటవీ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న సుమారు 10 పులులు స్థిర నివాసం ఏర్పరుచుకున్నాయి. ఇటీవల మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి ఆవాసం కోసం తిరుగుతున్నది. ఆగస్టు చివరి వారంలో కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్ అటవీ ప్రాంతంలో సంచరించిన పులి .. ఆపై ఆసిఫాబాద్ మండలం గుండి, గోవిందాపూర్ అటవీ ప్రాంతంలో పర్యటించింది. చిర్రకుంట సమీపంలో ఓ ఆవుపై దాడి చేసింది.
పులి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన అటవీ అధికారులు జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న అడవులతో పాటు కెరమెరి, తిర్యాణి అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. చివరి సారిగా పరందోళి, దేవాపూర్, బోరిలాల్‌గూడ అడవుల్లో సంచరించినట్లుగా గుర్తించారు. కానీ ఆ తర్వాత ఆ పులి ఎక్కడికి వెళ్లిందనేది తెలియరాలేదు. గత నాలుగు రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పులి సంచారం కనిపించింది. రెండు రోజుల క్రితం ఉట్నూర్ మండలంలోని అటవీసమీపంలోని గ్రామాల్లో పర్యటించిన పులి పశువులపై దాడిచేసింది. తాజాగా సోమవారం కెరమెరి అడవుల్లో సంచరించినట్లు అటవీ అధికారులు గుర్తించారు. జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్ అటవీ ప్రాంతంలో పర్యటించి క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లవద్దని, పశువులను మేత కోసం అటవీ ప్రాంతాల్లోకి తోలుకెళ్లవద్దని హెచ్చరించారు. పులి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, దానికి ఎలాంటి అపాయం తలపెట్టవద్దని కోరారు.