మంచిర్యాల, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో డయేరియా విజృంభిస్తూ దడ పుట్టిస్తున్నది. రోజు రోజుకూ కేసులు పెరుగుతుండగా, ఒక్క వారంలోనే 93 మంది అస్వస్థతకు గురికావడం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఈ నెల 1న చెన్నూర్ పట్టణంలోని బట్టిగూడెం, ఎమ్మెల్యే కాలనీకి చెందిన 8 మంది, 2వ తేదీన మరో 8 మంది, 3న ఏకంగా 15 మంది, 4న 8 మంది, 5న 19 మంది, 6న 12 మంది, 7న 13 మంది, 8న తొమ్మిది మంది, 9న ఒకరు డయేరియాతో హాస్పిటల్లో చేరడం ఆందోళనకు గురిచేస్తున్నది.
తాగునీటి నమూనాల సేకరణ.. అంతుచిక్కని కారణం..
చెన్నూర్ పట్టణానికి సరఫరా చేసే తాగునీరు కలుషితమవడంతోనే డయేరియా వచ్చిందని స్థానికులు అంటున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల వాసులు బతుకమ్మ వాగు నీరు తాగుతున్నారు. వాగు నుంచి వచ్చే ప్రధాన పైప్‌లైన్ కొలాయిల నీటినే తాగేందుకు ఉపయోగిస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా ఈ నీటిపైనే చెన్నూర్ పట్టణం ఆధారపడి ఉంది. బతుకమ్మ వాగు సంప్‌హౌస్ దగ్గర ఫిల్టర్ బెడ్ లేకపోవడంతోనే నీరు కలుషితమై పట్టణవాసులకు డయేరియా వచ్చిందనే చర్చ పట్టణంలో జోరుగా సాగుతున్నది. దీంతో నాలుగు రోజుల క్రితమే వాగు నుంచి నీటి సరఫరా నిలిపివేశారు. సంప్‌ను శుభ్రం చేసి, క్లోరినేషన్ సైతం చేశారు.
నాలుగు రోజులుగా బతుకమ్మ వాగు నుంచి నీటి సరఫరా ఆపేసినప్పటికీ, డయేరియా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. బట్టిగూడెం, ఎమ్మెల్యే కాలనీ నుంచి జెండావాడ, బలిజవాడ, లైన్‌గడ్డ, సొన్నాయిల వీధి, శివాలయం వీధితో పాటు తదితర ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయి. దీంతో డయేరియా ప్రబలడానికి కారణాలేమిటి అన్నది అంతుచిక్కకుండా పోయింది. దీంతో అధికారులు బతుకమ్మ వాగు నీటి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. దీనికితోడు పట్టణంలోని పలు ప్రాంతాలకు నీరు సరఫరా చేసే మిషన్ భగీరథ నీరు, పట్టణ కేంద్రంలోని మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి సైతం నీటి నమూనాలు తీసి వరంగల్‌లోని ల్యాబ్‌కు పంపించాలని నిర్ణయించారు. ఆ రిపోర్ట్లు వస్తేనే తాగునీటి కాలుష్యంపై స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు.
వైద్య శిబిరాలు..
డయేరియా ప్రబలిన బట్టిగూడెం, ఎమ్మెల్యే కాలనీలో పా టు పలు ప్రాంతాల్లో వైద్యాధికారులు ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి డయేరియాతో బాధపడుతున్న వారి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు. డయేరియా లక్షణాలుంటే వెంటనే ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స చేయించుకోవాలని సూ చించారు. డయేరియాపై స్థానిక వైద్యాధికారులు, మున్సిపాలిటీ అధికారులతో జిల్లా వైద్యాధికారి హరీశ్‌రాజ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూర్ పట్టణంలో ప్రబలుతున్న డయేరియాను అదుపులోకి తీసుకురావడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే బతుకమ్మ వాగు, మిషన్ భగీరథ నీటి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపించామన్నారు. ఫలితాలు రావాల్సి ఉందని, అవి వస్తే ఓ స్పష్టత వస్తుందన్నారు. పట్టణంలోని మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి సైతం నమూనాలు తీసి పంపాలని మున్సిపాలిటీ అధికారులను కోరామన్నారు. డయేరియాకు చెన్నూర్ ప్రభుత్వ దవాఖానాలో అన్ని రకాల సౌకర్యాలు, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.
బతుకమ్మ వాగు నీటినే తాగేవాళ్లం
నాకు బుద్ధి తెలిసనప్పటి నుంచి మేము బతుకమ్మ వాగు నీటినే తాగుతున్నాం. నాకు మూడు రోజుల క్రితం వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. మొదట మామూలుగా ఉన్న.. క్రమంగా అధికమై పూర్తిగా నీరసించి పోయిన. చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చాను. మూడు రోజుల నుంచి ఇక్కడే చికిత్స పొందుతున్నా. కొంత మేర కోలుకున్నా. ప్రభుత్వం పట్టణ ప్రజలకు శుద్ధజలం అందించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి.
– పాయికరావు రమేశ్, బలిజెవాడ, చెన్నూర్
నేను, నా బిడ్డ అవస్థ పడుతున్నాం..
నాకు, నా నాలుగేళ్ల కూతురు శివాగ్నిక వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నాం. మా కాలనీలో కొందరు ఇలానే ఇబ్బంది పడుతూ దవాఖానకు వెళ్లారు. మూడు రోజుల క్రితం అధికారులు వచ్చి బతుకమ్మ వాగు నీటిని తాగొద్దని చెప్పారు. నీటి సరఫరాను సైతం బంద్ చేశారు. అప్పటి నుంచి బోరు నీటిని తాగుతున్నాం. ఆ నీరు తాగినప్పటికీ నాకు, నా బిడ్డకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. చికిత్స కోసం దవాఖానాకు వచ్చాము. ఈ సమస్య ఎందుకు వచ్చిందో అధికారులు సాధ్యమైనంత తొందరగా చెప్పాలని కోరుతున్నాం.
– పల్లికొండ మాధవి, ఎమ్మెల్యే కాలనీ, చెన్నూర్