ఎదులాపురం, ఏప్రిల్ 30 : కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన జూనియర్ లైన్‌మన్ పవన్ కల్యాణ్ మృతదేహంతో తల్లిదండ్రులు లక్ష్మి, బుచ్చన్న, చెల్లి కొమల, బంధువులు కలిసి ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో సోమవారం విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కరెంట్ సప్లయ్ కావడంతో స్తంభంపై నుంచి కింద పడి మృతి చెందాడు. అయితే తమకు న్యాయం చేయాలని కల్యాణ్ కుటుంబ సభ్యులు, మిత్రులు ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్ఈ ప్రధాన గేటు ఎదుట మృతదేహంతో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ సత్యనారాయణ అక్కడికి చేరుకున్నారు. అలాగే నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు అంజేకుమార్, మందపల్లి శ్రీనివాస్, వెంకటేశ్, రాంకుమార్, మురళి, వేణులు మద్దతు తెలియజేశారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేసేదాక ఆందోళన చేస్తామన్నారు. జూనియర్ లైన్‌మన్ సంఘం తరఫున రూ.2 లక్షలు, లైన్‌మన్ తరఫున రూ.3 లక్షలు ఇస్తామని విద్యుత్ శాఖ డీఈటీ ఈరన్న తెలిపారు. అలాగే సంస్థ పరంగా వచ్చే రూ.5 లక్షలు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించామని పేర్కొన్నారు. అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామాని హామీ ఇవ్వడంలో ఆందోళన విరమించారు.
విధుల్లో చేరిన నెల రోజుల్లోనే..
రామకృష్ణపూర్‌కు చెందిన బుచ్చయ్య-లక్ష్మి దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి ఒక కూతురు కోమల ఉండగా పెళ్లి అయింది. కు మారుడు పవన్ కల్యాణ్‌కు ఉద్యోగం వచ్చాక వివాహం చేయాలనుకున్నారు. బుచ్చయ్య తనకున్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. నెల కిందట ఆదిలాబాద్‌లో పవన్ కల్యాణ్‌కు జూనియర్ లైన్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. దీంతో తమ కష్టాలు దూరమయ్యాయని సంతోషించారు. అయితే విధి వక్రీకరించి విద్యుదాఘాతంతో ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందటాన్ని కుటుంబసభ్యులు తట్టుకోలేక పోతుందన్నారు.