పల్లె ప్రగతితో దూసుకుపోతున్న గూడెం
ప్రత్యేక నిధులతో పనులు పూర్తి
దస్తురాబాద్, ఫిబ్రవరి 7 ;దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం నూతన జీపీ. ఇక్కడ 850 జనాభా ఉండగా, ఇందులో 646 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రత్యేక నిధులతో ఈ గూడెం అభివృద్ధిలో ముందుకుసాగుతున్నది. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి పనులతో తన రూపురేఖలు మార్చుకున్నది. నిర్దేశించిన పనులను పాలక వర్గం ప్రణాళికలతో పూర్తిచేసింది.
అభివృద్ధి పనులు..
ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు (రూ.10 లక్షల), జడ్పీటీసీ నిధుల(రూ.3 లక్షలు)తో గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. పంచాయతీ నిధులు రూ.3 లక్షలతో మట్టి రోడ్లు నిర్మించారు. కలెక్టర్ ప్రత్యేక నిదులతో ట్యాంకర్ను కొనుగోలు చేశారు. తడి,పొడి చెత్త వేరు చేసేందుకు రూ.2.50 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ.12.50 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. ఎమ్మెల్యే రేఖానాయక్ రూ.4లక్షలు కేటాయించగా, గ్రామంలో గణపతి షెడ్లు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా 8 వేలకు పైగా మొక్కలు నాటారు. గ్రామ శివారులో 20 గుంటల రెవెన్యూ/అటవీ భూమి చదును చేసి పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అందులో వివిధ రకాల 2 వేల మొక్కలు నాటారు. 8వ విడుత హరితహారం కోసం నర్సరీ ఏర్పాటు చేశారు. 13 వేల మొక్కల పెంపకం లక్ష్యంగా పెంచుతున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో ఏండ్ల తరబడి ఎదుర్కొన్న విద్యుత్ సమస్యలకు మోక్షం లభించింది. కొత్తగా 8 స్తంభాలను ఏర్పాటు చేశారు. మూడో తీగను అమర్చారు. గ్రామంలో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్ కాంతులతో గూడెం వెలిగిపోతున్నది. శాంతి భద్రతల కోసం ప్రధాన కూడలి వద్ద సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ సహకారంతో..
పల్లె ప్రగతి ద్వారా వచ్చే నిధులను గ్రామ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే పనులను పూర్తిచేశాం. మా గూడెంను పంచాయతీగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. తెలంగాణ సర్కారు సహకారంతోనే మా ఊరు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గ్రామస్తుల భాగస్వామ్యంతో దర్శంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నా. మా ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు మంజూరుచేయడంతో పనులు ముమ్మరంగా చేపట్టాం. – ముష్కే అంజన్న, సర్పంచ్, దేవునిగూడెం