ఎదులాపురం, జనవరి 1: సర్కారు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. భోజన వసతితోపాటు కనీస అవసరాలు తీరుస్తున్నది. కస్తూర్బా విద్యాలయాల్లో చదివే బాలికలకు గతంలో 15 రకాల వస్తువులతో హెల్త్కిట్లు అందించగా కొవిడ్ కారణంగా అవాంతరాలు ఏర్పడ్డాయి. విద్యార్థినులకు ఇబ్బందు లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్కిట్ల స్థానంలో అంతే మొ త్తంలో నగదు ఇవ్వడానికి నిర్ణయించింది. నెలకు రూ.100 చొ ప్పున విద్యార్థినుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నది. ఇందు కోసం విద్యాశాఖ బాలికల బ్యాంకు అకౌంట్ వివరాలు తీసుకుంటున్నది.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులకు నగదు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య కిట్ల స్థానంలో ఒక్కొక్కరికీ ప్రతి నెల రూ.100 చొప్పున చెల్లించాలని సర్కారు విద్యాశాఖను ఆదేశించింది. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బాలికల బ్యాంకు ఖాతాల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 కేజీబీవీలు ఉన్నాయి. వాటిల్లో 4,532 మంది బాలికలు చదువుతున్నారు. కేజీబీవీలో పేద విద్యార్థులే అధికంగా చదువుకుంటుండగా, ప్రభుత్వం ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నది. అయితే, కొవిడ్ కంటే ముందు విద్యార్థినులకు 15 రకాల వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్లను అందించింది. రెండేండ్లుగా కిట్ల పంపిణీ నిలిచిపోయింది. ఆరోగ్యానికి , వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన వస్తువులను సమకూర్చుకునేందుకు విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం కిట్ల స్థానంలో నగదు ఇవ్వాలని నిర్ణయించింది.
విద్యార్థినుల ఖాతాల్లోనే జమ
నగదును నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు బాలికలతో బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నారు. అలాగే అకౌంట్ ఉన్న వారి నంబర్లను సేకరిస్తున్నారు. ఇటీవల కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆధార్ నమోదు చేపట్టారు. కాగా, 650 మంది విద్యార్థినులు అకౌంట్ నంబర్లు ఇవ్వలేదని, వారి తల్లిదండ్రులకు సమాచారం అందజేశా మని జిల్లా సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ తెలిపారు.