నిర్మల్, జూన్ 15(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతుబీమాతోపాటు రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో ఇలాగే పోరాటాలు చేసేవాళ్లమని పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ మేరకు శనివారం రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం(ఏఐపీకేఎస్) ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నంది రామయ్య మాట్లాడుతూ.. వానకాలం ప్రారంభమైనప్పటికీ సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేవని, నేటికీ రైతుబంధు సాయం అందలేదని, ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు సమస్యలపై రేవంత్‌రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. సబ్సిడీపై అందజేయాల్సిన ఎరువులు, విత్తనాలను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సిన దుస్థితి నెలకొన్నదంటున్నారు. రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలను అరికట్టి, పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి రైతు సమస్యలను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జక్కుల రాజన్న, ఏ.శంకర్, రాజన్న, మచ్చ శ్రీనివాస్, గోనె లచ్చన్న, లక్ష్మణ్, సంతోష్, రైతులు పాల్గొన్నారు.
వానకాలం ప్రారంభమైనా రైతుబంధుపై విధివిధా నాలు రూపొందించకపోవడం శోచనీయం. వెంటనే పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతులను ఆ దుకోవాలి. చాలా చోట్ల మళ్లీ కరెంటు కోతలు మొ దలయ్యాయి. ఎక్కడ చూసినా ఎరువులు, విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఉంది. మాది రైతు ప్రభుత్వమని, ప్రజా పాలన అందిస్తామని చెప్పే సీఎం రేవంత్‌రెడ్డి రైతు సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం రైతు సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
నాకు బావాపూర్ శివారుల రెండెకరాల భూమి ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పాటికే రైతు బంధు సాయం అందింది. ఈ కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత యాసంగి డబ్బులను మొన్న టి వరకు వేశారు. ఈ వానకాలం పంటకు ఎప్పుడు ఇస్తరో ఏమో తెలియడం లేదు. జీలుగ విత్తనాలు కూడా దొరకడం లేదు. బ్యాంకులో రూ.1.40 లక్షల పంట రుణం ఉన్నది. రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పి ఆరు నెలలు దాటింది. బ్యాంకు వాళ్లు డబ్బులు కట్టుమని ఒత్తిడి చేస్తున్నరు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి అధ్వా న్నంగా తయారైంది.