ఆదిలాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) ః మత్స్యకారులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఏటా వానకాలంలో ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. సీజన్ ప్రారంభమై రెండున్నర నెలలు గడుస్తుండగా.. చేపపిల్లల పంపిణీ ప్రారంభ దశలోనే ఉండడంతో చెరువులకు చేరడానికి చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంలో ఏటా వానకాలం ప్రారంభంలో మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు సరఫరా చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం నీరుగారిపోతున్నది. తమ ఉపాధిని పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూడాల్సి వస్తున్నది. వానకాలంలో చెరువులు, ప్రాజెక్టుల్లోకి నీరు చేరిన ప్రారంభంలోనే చేప పిల్లలు వదిలితే బాగా పెరిగి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. జాప్యం కారణంగా నీటి వనరుల్లో నీరు తగ్గిపోవడంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. దీంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలంలో 1.16 కోట్ల చేప పిల్లలు పెంచడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. 216 చిన్న చెరువుల్లో 83.53 లక్షలు, 6 పెద్ద చెరువులు, 2 రిజర్వాయర్లలో 32.70 లక్షల చేప పిల్లలను వదలడానికి మత్స్యశాఖ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. చిన్న చెరువుల్లో 35 నుంచి 40 మిల్లీ మీటర్లు, పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో 80 నుంచి 100 మిల్లీ మీటర్ల పిల్లలను వదలనున్నారు. గతేడాది జిల్లాలో 76 చెరువుల్లో కేవలం 63 లక్షల పిల్లలను వదిలారు. సెప్టెంబరులో పంపిణీ చేయడంతో పెరుగుదల లేని కారణంగా ఉపాధి లభించకుండా పోయింది. చేప పిల్లలను ప్రభుత్వం సరైన సమయంలో పంపిణీ చేయకపోవడంతో మత్స్యకారులు సొంత డబ్బులతో కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో చేప పిల్లలను పంపిణీ చేసే ఎదుగుదల బాగా ఉంటుందని, సీజన్ చివరిలో వదిలితే ప్రయోజనం లేదని లబ్ధిదారులు అంటున్నారు.
ఉట్నూర్ మండలంలో గంగన్నపేట చెరువు, గోపాల చెరువు, సరస్వతి చెరువు, ఎల్లమ్మ చెరువు, గుడి చెరువుల్లో దాదాపు రూ.6.50 లక్షలు ఖర్చు చేసి 10 లక్షల చేప పిల్లలు సొంత డబ్బులతో వేసుకున్నాం. ప్రభుత్వం టెండర్ల ద్వారా చేప పిల్లలను సరఫరా చేస్తుండగా టెండర్లు తీసుకున్న వారు సరైన సమయానికి చేప పిల్లలను చెరువుల్లో వదలడం లేదు. నాసిరకంగా ఉంటున్నాయి. దీంతో మేము సొంత డబ్బులతో కొనుగోలు చేసుకుంటున్నాం. వానకాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లలు వస్తున్నాయి. నాసిరకంతోపాటు జాప్యం కారణంగా ఎదుగుదల లేక నష్టపోవాల్సి వస్తున్నది. చెరువులు నిండిన వెంటనే పిల్లలను వదిలితే లాభం ఉంటుంది. గతంలో మా సొసైటీలకు చేప పిల్లలకు బదులుగా డబ్బులు చెక్కుల రూపంలో అందించేవారు. అ పద్ధతి కొనసాగితే మేలు రకమైన చేప పిల్లలను కొనుగోలు చేసి పెంపకం చేపడితే ఉపాధి మెరుగుపడుతుంది. – బింగి వెంకటేశ్, మత్స్యకారుడు, ఉట్నూర్