ఆదిలాబాద్, నవంబర్ 25 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయం నమోదు చేసుకోనుంది. ఈ ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎక్స్ అఫీషి యో సభ్యులుగా ఎమ్మెల్యేలు ఓటు వేసే అవకాశం ఉంది. స్థాని క సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువగా గులాబీ పార్టీకి చెందిన వారు ఉండడంతో టీఆర్ఎస్ అభ్యర్ధి దండె విఠల్ భారీ విజ యం సాధించనున్నారు. రిటర్నింగ్ అధికారిగా ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ వ్యవహరిస్తుండగా.. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనుండగా.. 14న ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరం, ఉ ట్నూర్ మండల పరిషత్ కార్యాలయం, మంచిర్యాలలో పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరం, బెల్లంపల్లిలో ఎంపీపీ మీ టింగ్ హాల్, నిర్మల్‌లో జిల్లా పరిషత్ కార్యాలయం, భైంసా మండల పరిషత్ కా ర్యాలయం, ఆసిఫాబాద్‌లో జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్, కాగజ్‌నగర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తమకు అందుబాటులో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వీరంతా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ఏకగ్రీవానికి అవకాశం..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు గెలిచే అవకాశం ఏ మాత్రం లేకపోవడంతో రెండు పార్టీలకు చెందిన నాయకులు నామినేషన్లు వేయలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్‌తో పాటు మరో 23 మంది ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన అధికారులు అన్నీ సక్రమంగానే ఉన్నట్లు నిర్ధారించారు. నామినేషన్ల ఉపసంహరణకు గురు, శుక్రవారం సమయం ఉండడంతో ఇప్పటి వరకు ఆరుగురు ఇండిపెండెంట్లు అయిన జేక శేఖర్, ఎంపీ రిజాజొద్దీన్, కట్ట శ్యాంసుందర్, అబ్దుల్ రజాక్, గాజుల గంగాధర్, హరిణి తమ నామినేషన్లను వాపస్ తీసుకున్నారు. దీంతో 17 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉండగా.. నేడు చివరిరోజు కావడంతో చాలా మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. పోటీలో ఉన్నా ఏ మాత్రం గెలిచే అవకాశాలు లేకపోవడంతో ఇండిపెండెంట్లు తప్పుకోనున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
937 మంది ఓటర్లు..
ఎన్నికలు జరిగినా గులాబీ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకోనుంది. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 937 మంది ఓటర్లున్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు 308 మంది, జడ్పీటీసీలు 65, ఎంపీటీసీలు 554, ఎక్స్ అఫీషియో సభ్యులు 10 మంది ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్కు చెందిన వారు 70 శాతం వరకున్నారు. దీంతో ఎవరు బరిలో ఉన్నా టీఆర్ఎస్ విజయం ఖాయమనే చెప్పొచ్చు. ఇతరుల పోటీ నామమాత్రమే కానున్నది.