బెల్లంపల్లి, జనవరి 8 : ఎమ్మెల్యే గడ్డం వినోద్ అసమర్థతతోనే బెల్లంపల్లిలో కరంటు కష్టాలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమర్శించారు. సింగరేణి యాజమాన్యం విద్యుత్ సరఫరా నిలివివేసిన పట్టణంలోని 15వ వార్డులో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించారు. తమ ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని దుర్గం చిన్న య్య వారికి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో బెల్లంపల్లిలో నివసించే కార్మికులు, రిటైర్డ్ కార్మికులకు క్వార్టర్లను సొంతం చేసినట్లు గుర్తు చేశారు. గతంలో కార్మికుల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలివివేసిన ఘటనలు లేవని స్పష్టం చేశారు. కార్మికులు, ప్రజలు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలో మగ్గుతుంటే అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యుత్ లేకుండా ప్రజలు నరకయాతన పడుతుంటే చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సందర్శించారు. స్టాళ్ల వద్ద కూరగాయలు విక్రయిస్తున్న తీరును ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఎలాంటి సమస్య వచ్చినా తనకు సమాచారం అందించాలని, ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు నూనెటి సత్యనారాయణ, నాయకులు అరుణ్, లావణ్య, అలీ, కలీం, మౌనిక్, శేఖర్, సుందర్రావు, కొమురయ్య, సత్యనారాయణ, మల్లయ్య, సురేష్, చరణ్,శ్రీను, సతీశ్, మహేశ్ పాల్గొన్నారు.