కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/దహెగాం, నవంబర్ 2 : అప్రకటిత విద్యుత్ కోతలు రైతులకు శాపంగా మారాయి. బోర్లపై ఆధారడి వ్యవసాయం చేసుకునే వారికి తీరని నష్టాన్ని మిగిలిస్తున్నాయి. కళ్లముందే ఎండిపోతున్న పంటలను చూసి అన్నదాతలు కన్నీళ్లుపెట్టుకుంటున్నారు. జిల్లాలోని దహెగాం మండలంలో దాదాపు 6 వేల ఎకరాల్లో వరి పండిస్తున్నారు.
గతంలో ఈ మండలంలో 350 వరకే విద్యుత్ కనెక్షన్లుండేవి. కేసీఆర్ పాలనలో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. వందలాది మంది రైతులు 1500 పైగా బోర్లు వేసుకొని ఉచిత విద్యుత్‌ను సద్వినియోగం చేసుకుంటూ రంది లేకుండా రెండు పంటలు తీస్తూ వచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కరెంట్ కష్టాలు మొదలయ్యాయి.
అప్రకటిత కోతలు మొదలయ్యాయి. కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో రోజుకు 10 గంటలకుపైగా కరెంటు కోతలు విధించడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. లో ఓల్టేజీ సమస్యల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు సకాలంలో మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిగుబడి వస్తుందనే నమ్మకం లేదు
3 ఎకరాల్లో వరి సాగు చేస్తున్న. దాదాపు నెల రోజులుగా విద్యుత్ సరిగా ఉండడం లేదు. వరి పంటకు నీళ్లు పెట్టలేక పోతున్న. పొలం పూర్తిగా ఎండిపోతున్నది. వరి పొట్టదశలో ఉన్నప్పటి నుంచి విద్యు త్ కోతలు ఎక్కువయ్యాయి. దీంతో దిగుబడి బాగా తగ్గే ప్రమాద ముంది. కేసీఆర్ సర్కారులో ఎకరానికి 22 నుంచి 25 బస్తాలు దిగు బడి వచ్చేది. కానీ.. ఈ సారి విద్యుత్ కోతల వల్ల పంట దిగుబడి వ స్తుందనే నమ్మకం లేదు. విద్యుత్ కోతల గురించి అధికారులకు ఎ న్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.
– చిన్నకర్ రమేశ్, దహెగాం
అధికారులు పట్టించుకుంటలేరు
నాలుగు ఎకరాల్లో వరి వేసిన. కరెంటు కోతల కారణంగా పొలానికి సరిగా నీరందడం లేదు. అధికారులకు చెబితే పట్టించుకోవడం లేదు. కోతలు లేవని చెబుతూనే రోజుకు 10 గంటలకుపైగా కట్ చేస్తున్నరు. గతేడాది 24 గంటల కరెంటుతో రెండు పంటలు తీసినం. ఈ ఏడాది కరెంటు కోతల కారణంగా వర్షాకాలం పంట కూడా సరిగా వచ్చేలా లేదు. దహెగాం మండలంలో వరి పండిస్తున్న రైతులందరి పరిస్థితి గిట్లనే ఉంది.
– మామిడి బాలు, దహెగాం