నిర్మల్, మే 26(నమస్తే తెలంగాణ) : జిల్లావ్యాప్తంగా 4.30 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మక్క, సోయా, పప్పు దినుసులు పండించేందుకు అవసరమైన కార్యాచరణను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో వానకాలం సీజన్లో 4.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయాని అంచనా వేశారు.
ఇందులో పత్తి 1.50 లక్షల ఎకరాలు, వరి 1.20 లక్షలు, సోయా ఒక లక్ష, కందులు 10 వేలు, మక్క 30 వేలు, పసుపు 15 వేలు, మినుములు, పెసర్లు, ఇతర పంటలు 5 వేల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ఈసారి వరిని తగ్గించి, పత్తి పంటతోపాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతును ప్రోత్సహించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీర్ఘకాలం పాటు అధిక లాభాలనిచ్చే ఆయిల్‌పామ్ పంటను సాగు చేసేలా గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించలేదు.
49 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు
వానకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసే ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ఏ పంటలకు ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయో అంతే స్థాయిలో డీలర్ల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ఎరువుల కొరత రాకుండా అవకాశం ఉన్న చోట బఫర్ స్టాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి 49 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా.. ప్రస్తుతం 13,796 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి.
35 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా, ప్రస్తుతం 8,879 మెట్రిక్ టన్నులు.. 12 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరముండగా, 3,609 మెట్రిక్ టన్నులు.. ఆరు వేల మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరముండగా, 1,308 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే డీలర్ల వద్ద 475 గ్రాములు గల పత్తి విత్తనాల ప్యాకెట్లు 3.50 లక్షలు అందుబాటులో ఉన్నాయి. అలాగే వరి విత్తనాలు 20 వేల క్వింటాళ్లు, సోయా 25 వేలు, కంది 400 క్వింటాళ్లు, మక్క 1,200 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
నకిలీ విత్తనాలపై నిఘా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈసారి మే నెలలోనే వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు తొందరగా రావడంతో రైతులు తమ చేలలో దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్లోకి నకిలీ విత్తనాలు రాకుండా అధికారులు పటిష్ట నిఘా పెట్టారు. ఇందుకోసం ఇప్పటికే విత్తన విక్రయ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు.
మండలానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయగా, ఈ బృందంలో ఆ మండల పరిధిలోని ఎస్సై, వ్యవసాయ అధికారి ఉంటారు. అలాగే జిల్లా స్థాయిలో పోలీసు శాఖ నుంచి సీఐ, వ్యవసాయాధికారి, విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్లతో కూడిన బృందం ఈ తనిఖీలను పర్యవేక్షిస్తారు. జిల్లాలోని 19 మండలాల పరిధిలో ప్రభుత్వ అనుమతితో విత్తనాలను విక్రయించేందుకు 450 విత్తన దుకాణాలు ఉన్నాయి. మరోవైపు రైతులకు నాణ్యమైన విత్తనాల కొరత లేకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు చేయాలి..
రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటిస్తూ మర్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేసి లాభాలు పొందాలి. సాగులో మెలకువలు పాటించాలి. మార్కెట్లో నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్లైన్ విధానం తోపాటు, క్యూఆర్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చాం. ఇప్పటికే విత్తనాలు సరఫరా చేసే దుకాణాల్లో నిరంతరంగా తనిఖీ లు చేపడుతున్నాం.
నకిలీ విత్తనాల కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోకుండా రైతులు అధికారులను సంప్రదించి అవసరమైన సమాచారాన్ని పొందాలి. ముఖ్యంగా రైతులు లైసెన్సు కలిగి ఉన్న డీలర్ల వద్దనే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేయాలి. గ్రామాల్లోకి వచ్చి తక్కువ ధరకు ఇచ్చే విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దు. అలాగే రైతులు ఏటా పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నిర్మల్