మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 30 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2024 సంవత్సరంలో నేరాల తీవ్రత పెరిగిందని, గతేడాదితో పోలిస్తే కేసులు కూడా అధికంగా నమోదయ్యాయని సీపీ శ్రీనివాస్ వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి, ట్రాఫిక్ చలాన్, గ్యాంబ్లింగ్, తదితర కేసుల సంఖ్యా పెరిగినట్లు వివరించారు. రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో 2024 వార్షిక నేరాల నివేదికను ఆయన మీడియాకు విడుదల చేసి, వివరాలు వివరించారు. 2023లో మంచిర్యాల జోన్ పరిధిలో 5,115 కేసులు నమోదవగా, 2024 సంవత్సరంలో 4,455 కేసులు నమోదయ్యాయన్నారు. 121 గ్రేవ్ కేసులు, 10,132 పెట్టి, ఒక హత్య, రాబరీ, 228 దొంగతనం, 55 కిడ్నాప్, 41 రేప్ కేసులు, 371 చీటింగ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
హత్యాయత్నం 40, మిస్సింగ్ 273 కేసులు సమోదైనట్లు తెలిపారు. 2024లో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకోవడంతో పాటు, రూ.1.79 కోట్లతో పాటు, 3,216 లీటర్ల అక్రమ మద్యం, 11.48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి మంచిర్యాల జోన్ పరిధిలో 2,15,927 కేసులు నమోదవగా, రూ.5లక్షల మేర జరిమానా విధించినట్లు వివరించారు. 6,054 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవగా, 2,117 మందికి రూ.32.84 లక్షల పైచిలుకు జరిమానా విధించినట్లు తెలిపారు. 85 గ్యాంబ్లింగ్ కేసులు నమోదవగా, 561 మందిని అరెస్ట్ చేసి, రూ.28.30 లక్షలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
అలాగే 58 గంజాయి కేసులు నమోదవగా, 143 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 20.54 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. తరచుగా ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే 41 మందిపై హిస్టరీ షీట్స్, అందులో 33 మందిపై రౌడీ షీట్లను ఓపెన్ చేసినట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా మొత్తంగా 23,083 కేసులను పరిషరించినట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్నదని, ఆరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 281 సైబర్ కేసులు నమోదవగా, సుమారు రూ.5.20 కోట్ల సొమ్ము బాధితులు పోగొట్టుకున్నట్లు సీపీ తెలిపారు. పల్లె నిద్ర, ఆపరేషన్ గరుఢ, వైద్య శిబిరాలు, కార్మికుల పిల్లల కోసం వర్ సైట్ పాఠశాల ఏర్పాటు చేసి, సామాజిక నేరాల సంఖ్యను ఆదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు ఎగ్గడి భాసర్, చేతన, డీసీపీ అడ్మిన్ రాజు తదితరులు పాల్గొన్నారు.