నార్నూర్ : సీపీఎస్ (CPS) విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ( Old pension Scheme ) అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం మండల అధ్యక్షుడు రాథోడ్ కృష్ణారావు( Rathod Krishna Rao ) డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని తహసిల్ కార్యాలయంలో తహసీల్దార్ జాడి రాజలింగం కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 ఆగస్టు 23 తేదీన తెలంగాణ ఆవిర్భావం తరువాత జీవో తీసుకువచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జీవోను అమలు చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో 100 రోజులలో సీపీఎస్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం శోచనీయమన్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి పాత పెన్షన్ విధానం తీసుకు వచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాథోడ్ రవీందర్, సభ్యులు రాథోడ్ రమేష్, విజయ్ తదితరులున్నారు.