
ఇంద్రవెల్లి, జనవరి 6 : మెస్రం వంశీయులు ఈ నెల 31న నాగోబాకు నిర్వహించే మహాపూజలతో ప్రారంభం కానున్న జాతరను వైభవంగా నిర్వహిద్దామని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. మండలంలోని కెస్లాపూర్ నాగోబా దర్బార్‌హాల్‌లో జాతర ఏర్పాట్లపై గురువారం జిల్లా స్థాయి, ఐటీడీఏకు చెందిన అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్షించారు. జాతరలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నాగోబా జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రారంభం నుంచి ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలన్నారు. జాతర పరిసరాల్లో శానిటైజ్ చేస్తామని, భక్తులు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ ద్వారా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించాలని తెలిపారు. మర్రిచెట్లతోపాటు గోవాడ్ పరిసరాల్లో పారిశుధ్య పనులు చేసి శుభ్రతను పాటించాలన్నారు. తాగునీటి సమస్యలు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. భక్తుల రద్దీ ఉన్న ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసుల హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు.
నాగోబా దర్శనానికి వచ్చే ప్రముఖులతో మొక్కలు నాటించాలని, నాగోబా వనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ముత్నూర్ నుంచి కెస్లాపూర్ వరకు చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్‌లో చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలన్నారు. జాతరలో ఏర్పాటు చేసే హోటలల్లో తినుబండారాలను ఎప్పటికప్పుడు పరిశీలించి అనుమంతి లేని కలర్లను వాడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హోటలల్లోని తుకాలను పరిశీలించి మోసాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా మేత, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. జాతర ముగిసే వరకు అన్ని మార్గాల్లో బస్సులు నడిపించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలకు చెందిన అన్ని రకాల స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కెస్లాపూర్‌లోని బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం అందిస్తున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. ఉట్నూర్ ఆర్డీవో జాడి రాజేశ్వర్, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్‌నాథ్, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్‌రావ్, ఏపీవో జనరల్ భీంరావ్, ఐటీడీఏ మేనేజర్ రాంబాబు, పీటీజీ ఏపీవో రమణ, మెస్రం వంశీయులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.