లక్షెట్టిపేట, అక్టోబర్ 21 : ఎన్నికల్లో గెలిపిస్తే ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై మండలిలో గళమెత్తుతానని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, అల్ఫోర్స్ అధినేత డాక్టర్ వీ,నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కృషి చేస్తానని, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలను విడుతల వారీగా విడుదల చేసేందుకు ముందుండి పోరాడుతానన్నారు. విద్యారంగ సమస్యలపై మంచి అనుభవముందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి సులువుగా ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు సా ధించేందుకు ఉచిత శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం కొత్తగా కొలువులు సాధించిన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులంతా కోచింగ్ సెంటర్లు, గ్రంథాలయాలకు వెళ్లి చదువుకోలేరని, వాళ్లకోసం త్వరలో ఒక యాప్ రూపొందిస్తామన్నారు.
అంతకుముందు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలను సందర్శించిన ఆయన పట్టభద్రుల ఎన్నికలపై అవగాహన కల్పించడంతో పాటు ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడడారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం మండలిలో పోరాడుతానని హామీ ఇచ్చారు. ఆయన వెంట వివిధ కళాశాలల అధ్యాపకులు, పట్టభద్రులు ఉన్నారు.