భైంసా, ఏప్రిల్ 10 : భైంసా పట్టణంలో వంట గ్యాస్ కోసం శుక్రవారం భైంసా- నిర్మల్ జాతీయ రహదారిపై వినియోగదారులు ధర్నా చేశారు. అంతకుముందు గ్యాస్ ఏజెన్సీ వద్ద సిలిండర్లతో గంటల తరబడి బారులు తీరారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులు మాట్లాడుతూ పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపి ఏజెన్సీలు డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 60, కమర్షియల్ సిలిండర్‌పై రూ. 115ను పెంచారని ఆరోపించారు.
సిలిండర్ కోసం బుకింగ్ చేసిన తర్వాత 20 రోజులైనా సిలిండర్ రావడం లేదన్నారు. దీంతో ఇంట్లో వంట చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదునుగా గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సిలిండర్లను బ్లాక్ మార్కెట్లకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి సిలిండర్లు వెంట వెంటనే సరఫరా అయ్యేలా చూడాలని, బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న భైంసా పట్టణ సీఐ సాయికుమార్ అక్కడికి వచ్చి వారిని సముదాయించారు. ఏజెన్సీ నిర్వాహకులతో టోకెన్లు ఇప్పించడంతో వినియోగదారులు ధర్నా విరమించారు.