ఇంద్రవెల్లి, నవంబర్ 10 : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఆయుధం లాంటిదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనువడు, ఆర్పి పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని కాగ్నే ఫంక్షన్ హాల్లో శుక్రవారం గిరిజనేతరుల అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థలను ప్రవేటుపరం చేసి ప్రభుత్వాలు తప్పు చేశాయన్నారు.
దీంతో ఇతర దేశాలకు వలసలు పెరిగాయని పేర్కొన్నారు. కొన్ని ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్తున్నారని, ఎందుకు మార్చాలో ముందుగా చెప్పాలని సూచించారు. వారికి అనుకూలంగా మార్చుకోవడం కోసమే ఇలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లోని అటవీ సంపద కాపాడుతున్నది ఆదివాసులేనని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. రాష్ట్రంలో రాబోవు ఎన్నికల్లో దేనికీ, ఎవరికీ లొంగకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.