ఆదిలాబాద్, ఏప్రిల్ 2 5(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన జెండా పండుగ, ప్రతినిధుల సభలు దిగ్విజయమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెలు, కూడళ్లలో గులాబీ జెండాలు ఎగురవేసిన నాయకులు, ముఖ్యకార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ప్రతినిధుల సభకు తరలివెళ్లారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల కేంద్రాల్లో నిర్వహించిన సభలకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రశంసిస్తూ, కేంద్ర వైఖరికి నిరసనగా తీర్మానాలు చేశారు.
పండుగ వాతావరణం..
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో ప్రతినిధుల సభలు నిర్వహించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ సభకు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ నగేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌతు మనోహర్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పాల్గొన్నారు. బోథ్ నియోజకవర్గ సభకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అంతకు ముందు గ్రామాల్లో నాయకులు, బీఆర్ఎస్ జెండాలు ఎగురవేశారు. గ్రామాలు, పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతినిధుల సభలో తెలంగాణ పథకాలపై కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు..
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత, మైనార్టీ, మహిళ, బీసీ, దళితుల, గిరిజన సంక్షేమం, విద్య, ఉద్యోగ రంగాలు, పల్లె, పట్టణ ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్మానాలు చేశారు. అలాగే బేల నుంచి భోరజ్ వరకు ఎన్హెచ్-353ని నాలుగు వరుసలుగా మార్చకపోవడం, తెలంగాణపై మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, బీఆర్ఎస్పై దాడులు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, అదానీకి అంకితం, రెండు కోట్ల ఉద్యోగాలు, వ్యవసాయ మోటర్లకు కరెంటు మీటర్లు, ఉపాధి హామీకి ఉరి, ధరల పెరుగుదల, మోడీ ప్రభుత్వ వైఫల్యం, ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ ఆస్తుల అమ్మకం వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు.