మంచిర్యాల, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ముందస్తుగా నిర్వహించిన ప్లీనరీలు పండుగ వాతావరణంలో కొనసాగాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు కేటీఆర్ పిలుపు మేరకు అసెంబ్లీ సెగ్మెంట్లలో మంత్రి, విప్, ఎమ్మెల్యేలు ప్రతినిధుల సభలు నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో ఉదయాన్నే గులాబీ జెండాలు ఎగురవేసి.. వేలాది మంది గులాబీ శ్రేణులు తరలివెళ్లారు. మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా సభా ప్రాంగణాలకు చేరుకున్నారు. అంతకుముందు సమావేశాల వద్ద పార్టీ జెండాలు ఆవిష్కరించి.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు స్వాగతోపన్యాసం చేయగా.. పార్టీ ప్రాధాన్యత అంశాలపై ముఖ్య నాయకులు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ సాధించిన ప్రగతితోపాటు తీర్మానాలను ప్రవేశపెట్టి కరతాళ ధ్వనుల మధ్య ఆమోదించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మంగళవారం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించగా పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గులాబీ సైన్యం వేలాదిగా సభలకు తరలివచ్చింది. ‘జై కేసీఆర్.. జై బీఆర్ఎస్..’ ‘దేశ్ కీ నేత కేసీఆర్..’ అనే నినాదాలతో ప్రతినిధుల సభలు మార్మోగాయి. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోని వీధులు, కూడళ్లు గులాబీమయమయ్యాయి. పల్లెలు, పట్టణాల్లోని వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు ఉదయాన్నే బీఆర్ఎస్ జెండాలు ఎగురవేసి, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ప్రతినిధుల సభకు తరలివెళ్లారు. జిల్లాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ కార్యక్రమాలే దర్శనమిచ్చాయి. సభలకు వాహనాల్లో వెళ్తున్న వారు, నడుచుకుంటూ వస్తున్న మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఒక్కో సభకు మూడు వేల నుంచి ఐదు వేల పైచిలుకు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. గ్రామానికి 30 మంది ముఖ్యులు, పట్టణాల్లో వార్డుకు 10-15 మంది ముఖ్యుల చొప్పున తరలివచ్చారు. దీంతో అనుకున్న దానికంటే ఎక్కువ మంది తరలిరావడంతో సభా ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి.
నిర్మల్‌లో మంత్రి అల్లోల.. చెన్నూర్‌లో విప్ సుమన్
నిర్మల్ నియోజకవర్గంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్‌లో ఎమ్మెల్యే బాపురావ్, ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్, ముథోల్లోఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో సభలు నిర్వహించారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో జరిగిన సభలకు ఎంపీ వెంకటేశ్ నేతకాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెన్నూర్‌లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో జరిగిన సభకు మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకులకు దమ్ముంటే ఫోర్‌లేన్ మంజూరు చేయించాలి
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తున్నది. ఇందులో భాగంగానే జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని ఉపసనాల వరకు నాలుగు వరుసలు, అక్కడి నుంచి బేల మీదుగా జైనథ్ మండలం భోరజ్ వరకు రెండు వరుసల రోడ్డును మంజారు చేసింది. జిల్లా, రాష్ట్ర బీజేపీ నాయకులకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి భోరజ్ వరకు నాలుగు వరుసల రోడ్డును మంజూరు చేయించాలి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,400 కోట్లను బీసీలకు కేటాయిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్లను మంజూరు చేసింది. బీజేపీ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదానీ లాంటి వారికి దేశ సంపదను కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ధరలకు ఆస్ట్రేలియా నుంచి బొగ్గును కొనుగోలు చేస్తున్నది.
– ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
తీర్మానాల ఆమోదం..
ఒక్కో నియోజకవర్గంలో 15-20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. వ్యవసాయం, వైద్యం, విద్య, గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల, మహిళా సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి, కేంద్రం వివక్ష, మైనార్టీ వెల్ఫేర్, మోటర్లకు మీటర్లు, పల్లె, పట్టణ ప్రగతి, సామాజిక భద్రత, బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, సచివాలయానికి అంబేద్కర్ పేరు, సింగరేణి కార్మికులకు పన్ను మినహాయింపు, విభజన హామీలు, తెలంగాణపై వివక్ష, ఉద్యోగాలు, అభివృద్ధి పనులకు తీర్మానాల్లో స్థానం కల్పించారు.
బీజేపీని ప్రజలు నమ్మడం లేదు..
ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను బీజేపీ నాయకులు మానుకోవాలని, ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ విషయంలో స్థానిక ఎంపీ, ఇతర బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను వారు ఎందుకు తెరిపించే ప్రయత్నాలు చేయడం లేదని మండిపడ్డారు. జోగు రామన్నపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి రామన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
–ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
అప్పులపై కేంద్రం సమాధానం చెప్పాలి..
తొమ్మిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం రూ. 1.60 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. దీనిపై మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల పేరిట కార్పొరేట్ సంస్థలకు బీజేపీ ప్రభుత్వం కట్టబెడుతున్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అమలంబిస్తున్నదని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన భగీరథ లాంటి పథకాలకు ఆర్థిక సాయం చేయాలని నీతి ఆయోగ్ సూచించినా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారణమన్నారు.
– జీ నగేశ్, ఆదిలాబాద్ మాజీ ఎంపీ
గులాబీమయం..
పల్లెలు, పట్టణాలు, వాడలు, కూడళ్లు బీఆర్ఎస్ జెండాలతో నిండిపోయాయి. తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాక ముందు.. వచ్చిన తర్వాత మార్పును చూపిస్తూ అభివృద్ధి పనులపై నాడు-నేడు ఫొటోలతో ఫ్లెక్సీల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సభకు వచ్చిన వారు వీటిని ప్రత్యేకంగా చూస్తూ చర్చించుకున్నారు.
కేసీఆర్ తొమ్మిదేండ్ల ఉజ్వల పాలనలో తెలంగాణ పురోగమిస్తున్నది. వేల కోట్లతో ప్రగతి పరుగులు పెడుతున్నది. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మనం నంబర్‌వన్‌గా ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమంపై క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకు నాయకులు, కార్యకర్తలు వివరించాలి. మూడోసారి కూడా బీఆర్ఎస్సే అధికారంలోకి రావడం ఖాయమని పిస్తున్నది. ఇదే సమయంలో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.
– బోథ్ నియోజకర్గ ప్లీనరీలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
బీజేపీ నాయకుల్లారా.. సవాల్ విసురుతున్నా.. మీకు దమ్ము, ధైర్యం, రోశం ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి భోరజ్ వరకు ఫోర్‌లైన్‌ను మంజూరు చేయించండి. బీసీ సంక్షేమానికి రాష్ట్ర సర్కారు రూ.ఆరు వేల కోట్లు ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ రూ.1400 కోట్లు మాత్రమే ఇస్తున్నది. మోదీ చర్యలతో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు బతకలేని దుస్థితి నెలకొంది.
– ఆదిలాబాద్ నియోజకవర్గ ప్లీనరీలో ఎమ్మెల్యే జోగు రామన్న