హైదరాబాద్‌లో చెరువులు, కుంటల పరిధిలోని నిర్మాణాలను కూల్చివేస్తూ ‘హైడ్రా’ హడలెత్తిస్తుండగా, మంచిర్యాల జిల్లాలో మాత్రం అధికార పార్టీ లీడర్లే చెరువులను మింగేస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. ఇటీవల చెన్నూర్‌లోని శనిగకుంట చెరువు మత్తడిని కూల్చివేసిన ఘటనలో ‘హస్తం’ పార్టీ లీడర్ల మాయాజాలం బయటపడింది. చెరువును ఆనుకొని 15.20 ఎకరాల్లో మట్టిపోసిన వారిలో ఆ పార్టీ కీలక నాయకులే ఉండడం.. ఆ 15.20 ఎకరాల్లో 11 ఎకరాలు చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో ఉందని పోలీసులే చెప్పడం.. అక్కడ మట్టిపోయడం వల్లే 11వ వార్డులోని ఇళ్లలోకి వరద వస్తుందని వారు కుండబద్దలు కొట్టడం చర్చనీయాంశమవుతున్నది.
మరోవైపు వరద ఇండ్లలోకి రాకూడదనే స్థానిక కౌన్సిలర్ భర్త శనిగకుంట మత్తడిని పేల్చివేశారని వారు స్పష్టం చేయడం స్థానికులను ఆలోచింపజేస్తున్నది. ఇక చెరువులో మట్టి పోసి ఇళ్లు మునిగేందుకు కారకులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మత్తడిని కూల్చిన వారిని అరెస్టు చేసినప్పుడు, చెరువులో మట్టి పోసిన వారిని ఎందుకు వదిలేశారంటూ జనం ప్రశ్నిస్తున్నారు. చట్టం అందరికీ సమానమైనప్పుడు ఈ వ్యవహారం మొత్తానికి కారకులైన వారిపై కేసులు పెట్టక పోవడమేమిటని ప్రజలు మండిపడుతున్నారు.
మంచిర్యాల, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శనిగకుంట చెరువు మొత్తం విస్తీర్ణం 39 ఎకరాలు. దీని శిఖం 33.22 ఎకరాలు, ఎఫ్టీఎల్ కలుపుకొని 42 ఎకరాలు ఉంది. దీనికి బఫర్‌జోన్ కలుపుకుంటే మొత్తం 60 ఎకరాలు అవుతుంది. కానీ, ఇప్పుడు శనిగకుంట చెరువు 60 ఎకరాల విస్తీర్ణంలో కనిపించడం లేదు. 15.20 ఎకరాల్లో మట్టిపోసినట్టు అధికారులు చెబుతున్నా.. వాస్తవానికి అది 20 ఎకరాలకు పైనే ఉన్నట్లు తెలుస్తున్నది. చెరువు వెనకవైపు హైవే నంబర్-63 దగ్గర మొదలుకొని 11 వార్డు చివరి వరకు దాదాపు కిలోమీటరున్నర చెరువు లోపలికి మట్టిపోసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో పట్టాభూములను దాటుకొని వెళ్లి చెరువులో మట్టిపోశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే చెరువును ఆనుకొని పట్టాభూములుంటే.. దానిని కేవలం వ్యవసాయం కోసమో, పాడిపశువుల మేత కోసమో ఉపయోగించాలి. అందులో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దు.
మట్టిపోసి ఎత్తుపెంచడం, వరద రాకుండా అడ్డుకట్టలు వేయడం అనేది నిబంధనలకు విరుద్ధం. కానీ, శనిగకుంట విషయంలో అలాంటివేవీ పాటించకుండానే ఇష్టారాజ్యంగా మట్టిపోసుకుంటూ వెళ్లారు. తమ భూమిలోని నీరు రాకుండా ఎత్తుగా మట్టికుప్పలతో కట్ట సైతం నిర్మించారు. మరో వర్షం పడితే కచ్చితంగా మట్టిపోసిన భూములోకి సైతం నీరు వచ్చేది. అదే జరిగితే రానున్న రోజుల్లో భూములను విక్రయించడం ఇబ్బంది అవుతుందని, కుట్ర చేసి మత్తడిని కూలగొట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో అధికార పార్టీ కీలక నాయకులు ఉండడం, ఆ భూమిని ఇప్పుడు అధికారపార్టీకి చెందిన సీనియర్ నాయకుడికి విక్రయించడంతోనే అధికారులు మిన్నకుండిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే మత్తడి కూల్చిన వారిని అరెస్టు చేసిన పోలీసులు, చెరువులో మట్టిపోసిన వారిని వదిలేశారని స్థానికంగా చర్చ నడుస్తున్నది. మత్తడి కూల్చిన వారితో పాటు చెరువును దెబ్బతీసిన వారిని అరెస్టు చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది. అది చేయకుండా విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పడం వెనుక మర్మమేమిటి అని జనాలు ప్రశ్నిస్తున్నారు.
శనిగకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టిపోసిన నాటి నుంచే చెరువు వెనకవైపు ఉన్న 11 వార్డులోని ఇళ్లలోకి వరద వస్తుందని స్థానికులు చెబుతున్నారు. చాలా లోతుగా ఉన్న చెరువును మట్టితో నింపేశారని, దాంతో ఎగువనున్న గాలికుంట చెరువు నుంచి వచ్చి శనిగకుంటలో చేరాల్సిన వరద.. ఎత్తుకు ఎక్కలేక రివర్స్‌లో ఇళ్లలోకి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వరదలోనే కాలం వెళ్లదీయాల్సి వస్తుందని, పాములు, తేళ్లు వస్తుండడంతో భయం భయంగా గడుపుతున్నామని, గాలికుంట నుంచి వచ్చే వ్యర్థాలు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయని వాపోతున్నారు. పోసిన మట్టితీసి చెరువు లోతును పెంచితే తమకూ ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు.
4 వేల ట్రిప్పుల మట్టి తెచ్చిపోస్తుంటే.. అడ్డుకోకుండా ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకొని వరద ముప్పు నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. అసలు ఈ మట్టిపోసింది పట్టా భూముల్లోనేనా.. లేకపోతే చెరువు భూముల్లోనా అనేది సర్వే చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చెరువునకు హద్దులు ఏర్పాటు చేసి దాని ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్‌ను నిర్ణయించాలంటున్నారు. అలా చేయడంతో పాటు ఇప్పుడు బఫర్ జోన్లో పోసిన మట్టిని తొలగించి చెరువు చుట్టుపక్కల జననివాసం ఉండే ప్రాంతంలోకి వరద రాకుండా చూడాలని కోరుతున్నారు.
వర్షాలు పడ్డప్పుడల్లా శనిగకుంట చెరువు వరదంతా మా ఇంట్లోకి వస్తంది. మూడేళ్లుగా గిదే గోస. చెరువులో ఎప్పుడైతే మట్టిపోశారో అప్పటి నుంచే వరద వస్తుంది. మట్టిపోసిన భూమిలో ఎప్పుడూ నీరుండేది. అందులో మట్టిపోసి ఎత్తు పెంచడం వల్లే వరద వస్తుంది. వరదతో ఇండ్లల్లోకి పాములు వస్తున్నయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా గడుపుతున్నం. ఇప్పటికే దాదాపు పది పాములను చంపినం. చెరువును పునరుద్ధరించి న్యాయం చేయాలె. – బోగే దేవక్క, 11వ వార్డు
2020లో ఒకసారి చెరువులో మట్టి పోస్తుంటే మా సిబ్బంది వెళ్లి అడ్డుకున్నారు. 2022లో మరోసారి మట్టిపోయడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు మట్టి పోశాక విషయం మా దృష్టికి వచ్చింది. రాత్రివేళ మట్టి తెచ్చి పోస్తున్నట్లు గుర్తించాం. వెంటనే ఆపేయాలని నోటీసులిచ్చాం. చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు సిఫారసు చేశాం. మా పరిధిలో ఏం చేయాలో అది చేశాం. ఇప్పుడు మత్తడి పేల్చివేత ఘటన నేపథ్యంలో మట్టిపోసిన వారిపై చర్యలకు మరోసారి తహసీల్దార్‌కు సిఫారసు చేస్తాం. మట్టి తొలగింపు విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
– వేణు, ఇరిగేషన్ డీఈ (చెన్నూర్)