మంచిర్యాల టౌన్, జూలై 6 : ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, అతని బంధువులు, అనుచరులాంతా కలిసి మంచిర్యాలను మాఫియాకు అడ్డాగా మారుస్తున్నరని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించారు. శనివారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల జరిగిన సంఘటనలను ఉదహరిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆపై బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. మంచిర్యాల పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనుచరులు సెటిల్మెంట్లు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇదంతా ఎమ్మెల్యే పీఎస్సార్ కనుసన్నల్లోనే జరుగుతుందని, బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరుగడం లేదని, పైగా బాధితులపైనే కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు.
రాబోయే ఐదేండ్లలో వెయ్యికోట్లు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే అనుచరుడే చెబుతున్నాడంటే, ఇక ఎమ్మెల్యే ఎంత సంపాదించాలనునుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. మంచిర్యాల చరిత్రలో తనతోపాటు తనకంటే ముందున్న ఎమ్మెల్యేలంతా మంచితనాన్ని కాపాడారని, దాదాపు 50 ఏళ్లుగా మంచిర్యాలలో గూండాయిజం, రౌడీయిజం, కబ్జాలు, దౌర్జన్యం, బెదిరింపులుగాని లేవన్నారు. ఏడు నెలల్లోనే మంచిర్యాల నియోజకవర్గం ఆగమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పీఎస్సార్ గెలిచాక ఆయన బంధువులు, అనుచరులు మంచిర్యాలలో సెటిల్మెంట్లు, ఇతర దందాలు ఏ రకంగా చేస్తున్నారో ఎవరిని అడిగినా చెబుతారన్నారు.
లిటికేషన్ భూములపై నిఘా పెట్టి కోట్లు సంపాదించాలని చూస్తున్నారని, అక్రమంగా సంపాదించిన సొమ్ములో నుంచి ఎమ్మెల్యేకు ఇస్తారనేది జగమెరిగిన సత్యమని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో ముగ్గురు, నలుగురు వ్యక్తులకు పెత్తనం అప్పజెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, గతంలో పీఎస్సార్ స్వయంగా ప్రెస్మీట్లో మీ సంగతి చూస్తానని కొందరి పేర్లను ప్రస్తావించారని గుర్తు చేశారు. ఆయన చెప్పిన విధంగానే జూన్ 2న మంచిర్యాలలో పెద్ద ఎత్తున దాడి జరిగిందని, గడప రాకేశ్‌పై గూండాలు దాడి చేశారని, ఈ కేసులో నిందితులపై అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే పోలీసులపై ఒత్తిడితెచ్చి నామమాత్రపు కేసుపెట్టారని గుర్తు చేశారు. అంతకుముందు శ్రీరాముల మల్లేశ్పైనా, నవీన్ అనే కార్యకర్తపైనా దాడి జరిగిందన్నారు.
మామిడిపల్లిలో ఒకరిపై అటాక్చేశారని, ఈ కేసులో దెబ్బలు తిన్న వ్యక్తిపైనే కేసుపెట్టారని, అతడు 22 రోజులు జైల్లో ఉన్నాడని తెలిపారు. ఇదే గ్రామంలో ఎస్సీ వ్యక్తిపై దాడిజరిగితే గాయాలై చికిత్సపొందడానికి గ్రామస్తులు డబ్బు సాయం అందించారన్నారు. కసిపల్లిలో మండల ఉపాధ్యక్షుడు అనిల్ తల్లి బోరు నీరు వాడుకుంటే కేసుపెట్టించారని, మద్రాసులో చదువుకునే దండేపల్లికి చెందిన విద్యార్థిపై కేసు పెడితే పోలీసు కేసునమోదు చేశారని చెప్పారు. మంచిర్యాల ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాప్రాలో వందలాది ప్లాట్లు ఆక్రమించుకున్నట్లు బాధితులు సీఎం, డిప్యూటీ సీఎంకు మొరపెట్టుకున్నారని, ఇలా మంచిర్యాల పేరు బద్నాం చేస్తున్నారని, గతంలో మంచిర్యాల పేరు వస్తే మంచికోసమే వచ్చిందని, ఇలా చెడుగా మారుమోగడానికి కారకులెవరో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
స్వతంత్ర సంస్థ అయిన రెడ్‌క్రాస్ సొసైటీలో కూడా ఎమ్మెల్యే తానుచెప్పిన వ్యక్తులే ఉండాలనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుత ఘటనల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ యూత్ నాయకులు విజిత్‌రావు, పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నరేశ్, నాయకులు తిరుపతి, శ్రీపతి వాసు, చంద్రశేఖర్ హండే, సుంకరి రమేశ్, తాజుద్దీన్, శ్రీరాముల మల్లేశ్, పల్లపు రాజు, సిరిపురం శ్రీనివాస్, మధు పాల్గొన్నారు.