ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత సెప్టెంబర్‌లో జీవో విడుదల చేసింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు మెంబర్స్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. అనంతరం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తే రిజర్వేషన్ల పరిధి 50 శాతం దాటిపోతాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ కొందరు కాంగ్రెస్ నాయకులే కోర్టులో కేసు వేయడంతో ఎన్నికలు ఆపాలంటూ కోర్టు ఆదే శించింది. దీనిని సాకుగా చూపి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న హామీపై కాంగ్రెస్ సర్కార్ చేతులు ఎత్తేసింది. ఇది కాంగ్రెస్ సర్కార్ బీసీలకు చేసిన అన్యాయం అంటూ బీసీ సంఘాలు, నాయకులు మండిపడుతు న్నారు. పాత పద్ధతుల్లో ఎన్నికలకు వెళ్లినప్పుడు పాత పద్ధతుల్లో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చినట్లు బీసీలకు 23 శాతం రిజర్వేషనైనా ఇవ్వాలి. కానీ.. అది లేకుండా డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలను 17 శాతానికే పరిమితం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు పనికిరాని డెడికేషన్ కమిషన్ నివేదిక, ఎన్నికల నిర్వహణకు ఎందుకు పరిగణలోకి తీసుకుంటున్నారో చెప్పాలని బీసీ సంఘాల నాయకులు, బీసీలు ప్రశ్నిస్తున్నారు.
– మంచిర్యాల, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కేసీఆర్ సర్కార్ 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది. ఈ సమయంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన 27 శాతం రిజర్వేషన్‌తోపాటు బీసీలకు కేసీఆర్ సర్కార్ 23 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు సర్పంచి, వార్డు మెంబర్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. అప్పుడున్న కేసీఆర్ 23 శాతం ఇస్తే, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ ఖరారు చేసిన రిజర్వేషన్లు కేవలం 17 శాతానికే పరిమితం అయ్యాయి. దీంతో జిల్లాల్లో బీసీలకు రిజర్వ్ చేసిన సర్పంచ్ స్థానాల సంఖ్య భారీగా తగ్గింది. 2018-19 ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో బీసీలకు 49 సర్పంచ్ స్థానాలు రిజర్వ్ చేయగా.. ఈసారి కేవలం 23 స్థానాలకే పరిమితం చేశారు.
దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి మొత్తం సర్పంచి స్థానాల్లో కేవలం 4.86 శాతం, ఆసిఫాబాద్‌లో 5.97 శాతం, మంచిర్యాలలో 7.51 శాతం, నిర్మల్ జిల్లాలో 18 శాతం సర్పంచ్ స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేయడం, రొటేషన్ పద్ధతిని అవలంబించడం, డెడికేషన్ కమిషన్ నివేదికను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని చోట్ల బీసీలకు రిజర్వేషన్లు దక్కలేదు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపు 17 మండలాల్లో ఏ ఒక్క గ్రామంలోనూ బీసీలకు సర్పంచి స్థానం రిజర్వ్ కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంచిర్యాల జిల్లాలో భీమారం, కాసిపేట, కోటపల్లి, మందమర్రి, నెన్నెల మండలాల్లో, ఆదిలాబాద్ జిల్లాలో బజార్హత్నూర్, మావల, నేరడిగొండ, సాత్నాల, సొనాల, సిరికొండ మండలాల్లో, ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూర్, జైనూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్ యూ, తీర్యాని మండలల్లో ఒక్క సర్పంచి స్థానం కూడా బీసీలకు రిజర్వ్ కాలేదు. దీంతో ఆయా మండలాల్లోని బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే రిజర్వేషన్లు చేశామని చెప్తున్నారు. అలా చేసినప్పుడు గతంలో ఎన్ని స్థానాలైతే బీసీలకు కేటాయించారో అన్ని స్థానాలు తిరిగి బీసీలకు రావాలి. కానీ.. గతంలో వచ్చిన స్థానాల్లో సగం కూడా బీసీలకు ఎందకు రాలేందంటూ బీసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వేషన్ల కేటాయింపుపై బీసీలను తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బీసీల రిజర్వ్ చేసిన సర్పంచ్ స్థానాలు కనీసం 10 శాతం కూడా దాటలేదు. దీనిపై బీసీ సంఘాల నాయకులు, బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీలు ధర్నాలు, రాస్తారోకోలు సైతం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం బీసీ రిజర్వేన్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రతులను దహనం చేసి మరి నిరసన తెలిపారు.
ఇలాంటి పరిస్థితులను బీసీలకు సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ చేయకుండానే హడావుడిగా మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీ నుంచే తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొదలు పెట్టనుంది. దీంతో సర్కార్ తీరుపై బీసీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్ సర్కార్ మాటలు నీటి మూటలయ్యాయి. 42 శాతం రిజర్వేషన్లు దేవుడెరుగు.. కేసీఆర్ సర్కార్ బీసీలకు ఇచ్చిన 23 శాతం రిజర్వేషన్లు కూడా దిక్కులేదు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాలు కేవలం 17 శాతానికే పరిమితమ య్యాయి. 2018 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కార్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని జీవో తీసుకొస్తే కాంగ్రెస్ అడ్డుపడింది. అధికారంలోకి రాకముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ అమలు సాధ్యం కానీ హామీ ఇచ్చింది.
