ఆదిలాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రేషన్‌దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం ఏప్రిల్‌లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. మార్చి నెల వరకు పంపిణీ చేయగా మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం తరలించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో రేషన్ షాపుల్లో బియ్యం పురుగులు పట్టి ముక్కిపోతున్నాయి. ఇలా ప్రజాధనం వృథా అవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
మార్చి నెల వరకు తెల్లకార్డుల లబ్ధిదారులకు దొడ్డు (ఫ్లోరిఫైడ్) బియ్యం పంపిణీ చేయగా ఏప్రిల్‌లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కాగా మూడు నెలలుగా లబ్ధిదారుల ఈ బియ్యం తీసుకుంటున్నారు. రేషన్ బియ్యం లబ్ధిదారులు దుకాణాల ద్వారా పంపిణీ అవుతున్న బియ్యం విక్రయించకుండా తినేందుకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 355 రేషన్ దుకాణాలు ఉండగా, 1,91,755 రేషన్‌కార్డులున్నాయి. ప్రతి నెలా లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం ప్రతి నెలా 4083 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నది. పేదల్లో రక్తహీనత, హెమోగ్లోబిన్ లోపాన్ని తగ్గించేందుకు మార్చి వరకు ఫ్లోరిఫైడ్ రైస్ పంపిణీ చేశారు.
మార్చి నెల వరకు దొడ్డు బియ్యం కార్డుదారులకు అందించారు. మూడు నెలల కిందట సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కాగా దొడ్డు బియ్యం లెక్కలు పూర్తి చేయలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా 355 మంది రేషన్ దుకాణాలుండగా చాలా దుకాణాల్లో దొడ్డు బియ్యం నిల్వలు పేరుకపోయాయి. బియ్యం లక్కపురుగులు పట్టి పాడవుతుండడంతో ప్రభుత్వానికి నష్టం చేకూరనుంది. వానకాలం నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించిం ది.
ఇందులో భాగంగా జిల్లాలో మూడు నెలల కోటా 12,600 మెట్రిక్ టన్నులను కేటాయించింది. జూన్ 1 నుంచి బియ్యం పంపిణీ ప్రారం భం కాగా 30 వరకు కొనసాగనున్నది. రేషన్ డీలర్లు తమకు ప్రతి నెలా వచ్చే స్టాక్‌కు అనుగుణంగా దుకాణాలు తీసుకుంటా రు. మూడు నెలల కోటా ఒకేసారి ఇవ్వాల్సి రావడంతో దొడ్డు బియ్యం నిల్వల కారణఁగా సన్న బియ్యం ఎక్క డ ఉంచాలో తెలియడం లేదు. స్థలం లేకపోవడం తో గోదాంల నుంచి తక్కువ బియ్యం తెచ్చుకుంటున్నారు. దీంతో బియ్యం పంపిణీలో కొంత జాప్యం జరుగుతున్నదని చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి దొడ్డు బియ్యం నిల్వలు క్లియర్ చేయాలని కోరుతున్నారు.