మంచిర్యాల (ఏసీసీ), ఆగస్టు 16 : మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) రుణమాఫీలో అవకతవకలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 12న ‘సహకార నిర్లక్ష్యం’ పేరిట కథనం ప్రచురించిన విషయం విదితమే. అయితే సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో సిబ్బంది తప్పిదాల వల్లే రుణమాఫీలో పొరపాట్లు జరిగినట్లు తేలింది. పీఏసీఎస్ కార్యదర్శి పెంట సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేసే సమయంలో పొరపాట్లు దొర్లాయని తెలిసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడినట్లు అర్థమవుతోంది.
ముల్కల్లకు చెందిన రైతు బాపుకు వాస్తవానికి రూ. 9,727 రుణమాఫీ కావాల్సి ఉండగా, సొసైటీ కార్యదర్శి రికార్డుల్లో సరిగా ఎంట్రీ చేయలేదు. దీంతో రైతు పేరు మీద రూ.1,10,515 రుణం మాఫీ అయ్యింది. నేరుగా తన సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో ఆయన అవాక్కయ్యాడు. కార్యదర్శి పెంట సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా, పొంతన లేని సమాధానం ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం కలెక్టర్ వరకు వెళ్లింది. రుణాల రీషెడ్యూలు ఎంట్రీ చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఆ రుణ వివరాల్లో తేడాలు వచ్చినట్లు తెలుస్తున్నది. ఈక్రమంలో కలెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు.. అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. మొత్తం మీద అసలుకు మించి ఎక్కువగా రుణంమాఫీ అయిన సొమ్మును ప్రభుత్వానికి సహకార శాఖ రీఫండ్ చేయనున్నది.
వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే సహకార శాఖలో రుణాలు కాస్త భిన్నంగా ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా 20 సహకార సంఘాలు ఉండగా, చాలా చోట్ల ఇలాంటి అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. బాధితుల కోణంలో కాకుండా.. జిల్లా వ్యాప్తంగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నిజానికి తమ పేరిట లోను లేకపోయినప్పటికీ, రుణమాఫీ అయినట్లు మెస్సేజ్‌లు రావడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం తాము ఇచ్చిన పలు డాక్యుమెంట్లను వాడుకుని, తమ పేరిట రుణాలేమైనా తీసుకున్నారా..? అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల తాము రుణాలు తీసుకున్న చోట ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు ఆడిట్ చేసినట్లయితే ఇలాంటి పొరపాట్లు జరిగే అవకాశముండదు.
ఇక ఈ వ్యవహారమంతటికీ కారణమైన కార్యదర్శిపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇన్స్పెక్టర్ నివేదికను జిల్లా ఉన్నతాధికారికి సమర్పించగా, ఆయన దాన్ని పరిశీలించి, కలెక్టరు, రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీకి నివేదించడం జరిగింది. మూడు రోజుల కిందటే ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపించగా, ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరోవైపు జిల్లాలోని ఇతర సహకార సంఘాల్లో కూడా దర్యాప్తు జరపాలని ప్రజలు కోరుతున్నారు. ఫిర్యాదు వస్తేనే ముందుకు కదలడంలాంటివి కాకుండా, ఉన్నతాధికారులు స్వచ్ఛందంగా ఎప్పటికప్పుడు రికార్డులు తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. అప్పుడే ఇలాంటి పొరపాట్లకు తావుండదని అభిప్రాయపడుతున్నారు.
మంచిర్యాల పీఏసీఎస్‌లో రుణమాఫీలో గందరగోళం నెలకొన్న విషయం వాస్తవమే. డేటా ఎంట్రీ సమయంలో నిర్లక్ష్యం వల్లే అది జరిగింది. రైతు బాపుకు రావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో రుణం మాఫీ అయింది. దీనిపై విచారణ నిర్వహించి నివేదికను పై అధికారులకు పంపించాం. ఆదేశాలు రాగానే కార్యదర్శిపై చర్యలు తీసుకుంటాం. ఎక్కడా ఇలాంటి పొరపాట్లు జరిగినట్లు ఫిర్యాదు రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం.