మంచిర్యాల, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘విద్యా శాఖ-సమగ్ర శిక్ష’లో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలనే డిమాండ్‌తో నేటి(మంగళవారం) నుంచి ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెగ్యూలరైజ్ చేసి, వెంటనే పే-స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గడిచిన నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి పక్షం రోజుల ముందే కార్యాచరణ ప్రకటించి, ఈ నెల 10వ తేదీన సమ్మెకు వెళ్తామని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరినీ రెగ్యూలర్ చేస్తామని, గతేడాది నవంబర్ 18వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కానీ.. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామంటున్నారు. మేం కడుపు మండి నిరసన తెలుపుతుంటే.. మరోపక్క విజయోత్సవాలంటూ అధికారులు ఎవరూ తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఇచ్చిన గడువు పూర్తయినందున నేటి నుంచి సమ్మె చేస్తామని, అప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు వెనకాడబోమని స్పష్టం చేస్తున్నారు.
స్తంభించనున్న విద్యా వ్యవస్థ
విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులు వివిధ స్థాయిల్లో పని చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టమ్ అనలటిక్లు, టెక్నికల్ పర్సన్, మండల స్థాయిలో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు.. స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో సీఆర్పీలు, పాఠశాల స్థాయిలో పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్, కేజీబీవీలు, యూఆర్ఎస్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్లు, పీజీసీ ఆర్టీలు, వంట మనుషులు, వాచ్ ఉమెన్స్, స్వీపర్స్.. ఇలా అన్ని విభాగాల్లో ఈ ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 19,600 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉండగా.. మంచిర్యాల జిల్లాలో 575, నిర్మల్‌లో 659, ఆసిఫాబాద్‌లో 496, ఆదిలాబాద్ 657 మంది పని చేస్తున్నారు. వీరంతా నేటి నుంచి సమ్మె చేస్తే విద్యా వ్యవస్థ స్తంభించిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. నాన్ టీచింగ్ ఉద్యోగులు అందరూ సమ్మెలో పాల్గొననుండడంతో వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులకు ఈ సమ్మె శాపంగా మారనుంది. అన్నింటి కంటే ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల సమ్మెతో విద్యార్థుల తుది ఫలితాలపైనా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.
ఉద్యోగుల డిమాండ్లు..
సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..
గతంలో రెగ్యూలరైజ్ కోసం సమ్మె చేసిన సందర్భంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని ఏడాది కాలంగా ఎదురు చూశాం. నాలుగు రోజులు రిలే దీక్షలు చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. అందుకని ముందు ప్రకటించిన కార్యాచరణను అనుసరించి నేటి నుంచి సమ్మెకు పోతున్నాం. మా న్యాయమైన సమస్యలను పరిష్కారం అయ్యేందుకు ఎంత దూరమైన పోతాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడుతాం.
– రాజన్న, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం, మంచిర్యాల జిల్లా సెక్రెటరీ.
నోటీసులిచ్చినా పట్టింపు లేదు
సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వస్తే సచివాలయానికి పిలిచి చర్చించి మీ సమస్యలు పరిష్కరిస్తాం అన్నారు. చాయ్ తాగినంత సేపు పట్టదు మీ సమస్య పరిష్కారానికి అని చెప్పారు. కానీ.. యేడాదిగా ఎలాంటి డిమాండ్లు నెరవేర్చలేదు. కొన్ని రోజులుగా మేం పోరాటాలు చేస్తున్నాం. అసెంబ్లీ ముట్టడి చేశాం. జిల్లాల్లో ర్యాలీలు చేశాం. ఇందిరా పార్క్ ఎదుట ధర్నా చేశాం. శాంతియుత పోరాటం చేస్తున్నా ఫలితం లేకపోవడంతో సమ్మె నోటీసులు ఇచ్చాం. సమ్మెకు ముందు నాలుగు రోజులు రిలే దీక్షలు చేపట్టాం. కానీ.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలి. అప్పటి వరకు పే-స్కేల్ అమలు చేయాలి. అప్పటి దాకా ఉద్యోగులందరం సమ్మెలోనే ఉంటాం.
– ఎ.సుమలత, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు.