ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 6: మే 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ సురేశ్‌కుమార్, అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఫిబ్రవరి 8 నాటికి 4,55,437 మంది ఓటర్లున్నారని, మొత్తం 676 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు గత అనుభవాల దృష్ట్యా పోలింగ్ సిబ్బందికి ఇబ్బందుల్లేకుండా పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రశాంత ఎన్నికల కోసం పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మండలాల్లో సీఆర్పీఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎండలు ముదిరిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉపాధి పనుల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీతో పాటు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవితో కలిసి పాఠశాలల్లో వసతుల కల్పనపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 685 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వేసవి సెలవులు ముగిసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన బాధ్యతలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.