ఎదులాపురం, డిసెంబర్ 16 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
2023 సంవత్సరంలో 47 కేసులను గాను 17 కేసులు పెండింగ్, ట్రయల్లో 25 కేసుల విచారణలో ఉన్నాయని, 5 కేసులు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు రూ.24,12,500 ఉపశమనం కింద బాధితులకు పరిహారం అందించడం జరిగిందన్నారు. కేసుల పరిష్కారానికి, బాధితులకు పరిహారం అందేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెండింగ్ కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న న్యాయసేవలు, పరిహారంపై నివేదికను అందజేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాధితులకు నష్ట పరిహారం చెల్లింపులు తదితర అంశాలపై వివరంగా సమీక్షించారు.
గంజాయి సాగు చేసే రైతులకు రైతుబంధు, ఇతర ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు, గంజాయి సాగు ,రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేస్తూ ప్రభుత్వ పథకాలైన రైతుబంధు లాంటివి రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ముఖ్యంగా యువత మత్తు పదార్థాల బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసైన యువత, ఇతరులకు డి అడిక్షన్ సెంటర్ ద్వారా నయం చేసే అవకాశం ఉన్నందున వాటిని వినియోగించుకోవాలన్నారు. అనంతరం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి స్మగ్లర్లపై పీడీయాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గంజాయి విక్రయదారులను, పండించే వారిని నియంత్రిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 27 కేసులలో 64 మంది వ్యక్తులపై గంజాయి కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి దాదాపు 291 కిలోల, రూ.67,64,793 విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
జిల్లా వ్యాప్తంగా గంజాయి పండిస్తున్న 38 మంది వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని వీరిపై 20 కేసులను నమోదు చేస్తూ 133 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా 275గంజాయి మొక్కలను సైతం స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసినట్లు తెలిపారు. అనంతరం గంజాయి రహిత సమాజాన్ని సాధించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోస్లర్ను కలెక్టర్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఖుష్బుగుప్తా విడుదల చేశారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి, ఆర్డీవోలు స్రవంతి, జీవాకర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారులు సునీత, రాథోడ్ రమేశ్, శంకర్, డీఎస్పీ వీ ఉమేందర్, ఇతర శాఖ అధికారులు ఉన్నారు.