లక్షెట్టిపేట, మార్చి 6 : ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్తో కలిసి సందర్శించారు. వంటశాల, భోజనశాల, హాజరు పట్టికలు, పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యనందిస్తున్నదన్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో చేపడుతున్న 30 పడకల ప్రభుత్వ దవాఖాన పనులను పరిశీలించారు.త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు పరిశీలించారు. మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మున్సిపాలిటీలో ఆస్తి పన్నులను 100 శాతం వసూలు చేసి పురపాలక సంఘ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.
హాజీపూర్, మార్చి 6 : కేంద్రీయ విద్యాలయంలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం గుడిపేటలో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారని, వీరిని మరింత ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా కృషి చేయాలని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు కోసం తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండేతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.