తాండూర్, జనవరి 9 : పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం తాండూర్ మండలం మాదారంలోని సింగరేణి పాఠశాలను పరిశీలించారు. ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న ఎంజేపీ గురుకుల పాఠశాలను ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు అనుకూల పరిస్థితులపై స్థానికులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ విషయంపై సింగరేణి సీఅండ్ ఎండీతో మాట్లాడి నిర్ణ యం తీసుకుంటామన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను మండల తహసీల్దార్ ఇమ్రానాఖాన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు స్వయంగా పాఠ్యాంశాలు బోధించారు. విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పరీక్షించారు. మాదారం ఎస్ఐ సౌజన్య, డీటీ వీవీఆర్కేడీ ప్రసాద్, నాయకులు సూరం దామోదర్‌రెడ్డి, పుట్ట శ్రీనివాస్, కుష్నపల్లి లక్ష్మణ్, మోమిన్అలీ, గట్టు లక్ష్మణ్, బానేష్ తదితరులు పాల్గొన్నారు.