దండేపల్లి, అక్టోబర్ 11 : కులమతాలకు అతీతంగా అంతర్జాతీయస్థాయి సౌకర్యాలతో అత్యంత ప్రామాణికమైన విద్య అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నదని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. దండేపల్లి మండలం రెబ్బెన్పెల్లిలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావుతో కలిసి శుక్రవారం సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ క్రమంలోనే సమీకృత గురుకుల పాఠశాల సముదాయ భవనానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అందుకు ప్రభుత్వం 22 ఎకరాల 15 గుంటల భూమి కేటాయించిందన్నారు. యేటా కనీసం 500 మంది విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వెళ్తారని పేర్కొన్నారు. పాఠశాల భవన నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.
ఈ గురుకులంతో మండల రూపురేఖలు మారుతాయన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేంచంద్, వైస్ చైర్మన్ ఆరీఫ్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో ప్రసాద్, నాయకులు, అధికారులు ఉన్నారు.