నిర్మల్ టౌన్, నవంబర్ 3 : ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అశిష్ సంగ్వాన్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. నవంబర్ 3 నుంచి డిసెంబర్ 3 వరకు ఎన్నికల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. 3 నుంచి 10 వరకు నామినేషన్లు, 13న పరిశీలన, 15న ఉప సంహరణ, 30న పోలింగ్, 3న కౌంటింగ్‌తో ఈ ప్రక్రియ పూర్తవుతుంందని తెలిపారు.
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌లో 244, నిర్మల్‌లో 316, ముథోల్‌లో 311 మొత్తం 922 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల పరిధిలో నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్‌లోని కొన్ని మండలాలను ఓటింగ్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు పెద్దఎత్తున స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని అంశాలపై అభ్యర్థులు, ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇందుకోసం ఓటర్ కార్డు, ఓటరు స్లిప్‌లను నాలుగు రోజుల ముందుగానే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఓటు వేసుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డుకు అనుమతి ఉంటుందన్నారు. ఎన్నికల ఖర్చును ప్రతి మూడు రోజులకొకసారి సంబంధిత అధికారులకు తెలపాలని సూచించారు. జిల్లాలో పార్టీల ప్రచారం, సభలు, ఇతర అంశాలపై ప్రత్యేక బృందాల నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల అక్రమాలపై సీవిజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
సువిధ యాప్ ద్వారా నామినేషన్లు పోటీచేసే అభ్యర్థుల ర్యాలీలు, మీటింగ్‌ల కోసం ఆన్లైన్ ద్వారా అనుమతి తీసుకోవాలన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. దివ్యాంగులకు పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే 8 ప్రత్యేక పోలీస్ బృందాలు చేరుకున్నాయన్నారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల నియామవళి పాటించాలని కోరారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారి తిరుమల, అధికారులు పాల్గొన్నారు.