నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా ( Adilabad District ) నార్నూర్ మండలం మలంగి పంచాయతీ పరిధిలోని బారిక్ రావుగూడా సమీపంలోని వంతెన ఆదివారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో లక్షలాధి రూపాయాలతో రోడ్డు, వంతెన నిర్మాణ సమయంలో అధికారులు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అనతికాలంలోనే వంతెన కూలిపోయిందని ఆరోపించారు.
సదరు కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో సీసీరోడ్డుపై పగుళ్లు ఏర్పడి ఆదివారం రాత్రి ఒక్కసారిగా కూలి పోయిందని తెలిపారు. వంతెన కూలిపోవడం వల్ల రాకపోకలకు అవస్థలు తప్పడం లేదని గ్రామస్థులు వాపోయారు. వంతెనపై ప్రయాణ సమయంలో ఆదమరిస్తే అంతే సంగతి అంటూ వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వంతెన నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.