రెబ్బెన : బెల్లంపల్లి ఏరియా కు సంస్థ నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సమష్టి కృషితో అధిగమిస్తామని బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అక్టోబర్ మాసానికి సంబంధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. అక్టోబర్ మాసంలో ఏరియాకు 2.25 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్ధేశించగా 64శాతంతో 1.44 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని వివరించారు. ఏరియా లోని గోలేటి ఓసీపీ 2022-2023 సంవత్సరంలో ప్రారంభం అవుతుందని, 3.5 మిలియన్ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో 15సంవత్సరాల పాటు ఓసీపీ నడుస్తుందని తెలిపారు.
ఏరియాలోని కార్మికులు, కార్మికుల కుటుంబాలు, కాంట్రాక్టు కార్మికులందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకొవాలని సూచించారు. గోలేటి శ్రీ భీమన్న క్రీడమైదానంలోని వాకింగ్ ట్రాక్‌కు మరమత్తులు చేయిస్తున్నామని, యువతను ప్రోత్సహించటం కోసం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్మిక కాలనీలకు మిషన్ భగీరథ మంచినీటిని అందిస్తున్నామని వివరించారు. బెల్లంపల్లి ఏరియా లోని కార్మికులు, యూనియన్ నాయకులు, అధికారుల సమష్టి కృషితో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు అధిగమిస్తామన్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏరియా డీజీఎం(పర్సనల్) రాజేంద్రప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఐ.లక్ష్మణ్‌రావు, డీవైపీఎం తిరుపతి ఉన్నారు.