“మంచిర్యాల పట్టణంలోని శివారు కాలనీలకు గోదావరి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు రావద్దంటే గోదావరి మీద కరకట్ట కట్టాలి. మీరు మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్‌రావును గెలిపించండి. చుక్క నీరు రాకుండా చూసే బాధ్యత నాది. ఆ పని కూడా లేట్ చేయకుండా చేస్తాం. అవసరమైతే వచ్చే ఎండాకాలంలోనే మొదలు పెట్టి పూర్తి చేస్తాం..” అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెసోళ్లకు ఓటు వేశారనుకో వాడ కట్టుకో పేకాట క్లబ్ వస్తదన్నారు.
ఇండ్లు అమ్ముకోవడం, పేకాటలో పెట్టడం తప్పా.. ఏమి అభివృద్ధి జరగదని పేర్కొన్నారు. ఇది చాలా ప్రమాదకరమని, కుటుంబాలు కూడా దెబ్బతింటాయని హెచ్చరించారు. సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకాల కింద 15 వేలకుపైగా ఉద్యోగాలిచ్చామని, ఇల్లు కట్టుకోవడానికి రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చామని, లాభాల వాటా, దసరా, దీపావళి బోనస్ రూ.1000 కోట్లు పంచామని గుర్తు చేశారు. ప్రతి సింగరేణి కార్మికుడికి రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షలు రావడం సంతోషమని పేర్కొన్నారు.
– మంచిర్యాల, నవంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, నవంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్‌రావును గెలిపిస్తే.. గోదావరి మీద కరకట్ట కట్టిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇచ్చారు. మంచిర్యాలలో గోదావరి పక్కనున్న ప్రాంతాల్లోకి నీళ్లు వస్తున్నయని, ఆ ఏరియాలకు నీళ్లు రావొద్దంటే గోదావరి మీద ఒక కరకట్ట అడ్డుగోడ కట్టి, నీళ్లను ఆపాలన్నారు. మీరు దివాకర్‌రావును గెలిపించండి 100 శాతం ఆ పని నేను చేయిస్తానని స్పష్టం చేశారు.
మంచిర్యాలలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. పెద్ద పట్టణమైన మంచిర్యాలను కాపాడుకుంటామన్నారు. గోదావరి మీద కరకట్ట నిర్మించి చుక్క నీరు కూడా పట్టణంలోకి రాకుండా చూసే బాధ్యత నాదన్నారు. ఆ పని కూడా వెంటనే లేట్ చేయకుండా చేస్తామని, అవసరమైతే వచ్చే ఎండాకాలంలోనే ధనాధన్ మొదలు పెట్టి శరవేగంగా పూర్తి చేస్తామన్నారు. దివాకర్‌రావును గెలిపించుకుంటే మీకు చాలా మేలు జరుగుతుందన్నారు.
దివాకర్‌రావు సౌమ్యుడు, మర్యాద పూర్వకంగా ఉండే మనిషి. ఇగ, మీ దగ్గర ఉన్న కాంగ్రెసాయనకు పొరపాటున ఓటు వేశారనుకో.. వాడ కట్టుకో పేకాట క్లబ్ వస్తదన్నారు. మంచిర్యాల నిండా పేకాట క్లబ్‌లు అయితాయని, క్లబ్‌లకు మాత్రం కొదవ ఉండదన్నారు. ఇండ్లు అమ్ముకోవాలే.. పేకాటలో పెట్టాలే.. గంతకు మించి ఏం ఉండదన్నారు. ఇది చాలా ప్రమాదకరమని, దెబ్బతింటారని.. చాలా ఖతర్నాక్ పని అయితది హెచ్చరించారు. అందుకే జా గ్రత్త ఇవన్నీ మీరు చర్చ చేయాలని, ఎవరు గెలిస్తే మంచిదని నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త ైస్టెల్ మొదలు పెట్టారని సీఎం కేసీఆర్ అన్నారు. ఎట్లాగు గెలుస్తలేం ఓడిపోతున్నమని.. కొత్త పద్ధతిలో నన్ను గెలిపియండి బై.. నేను కూడా బీఆర్ఎస్లనే జాయిన్ అయితా అని చెప్పుకుంటున్నట్లు తెలిసిందన్నారు. ఇక్కడున్నాయన కూడా అట్టనే చెప్తున్నట్లు నాకు వార్త వచ్చిందన్నారు. అలాంటిది ఏం లేదని, అందంతా అబద్ధమని, ఝూటా ముచ్చట అని స్పష్టం చేశారు. ఏదన్న లంగతనం చేసి గెలవాలనే బద్మాష్ గిరి తప్ప అది వాస్తవం కాదన్నారు. మేము పదేండ్లు కష్టపడి అన్ని రంగాల్లో ఎప్పుడు అనుకోని పనులు చేశామన్నారు. రైతాంగానికి, పేద ప్రజలకు అన్ని రకాలా అభివృద్ధి చేసుకున్నామన్నారు.
ఇవన్నీ కూడా మీ ముందు ఉన్నాయని, మరి వాళ్లు వచ్చి మేం 3 గంటలే కరెంట్ ఇస్తాం. ధరణి తీసేస్తాం. రైతుబంధు దండుగా అని మాట్లాడుతున్నరని మండిపడ్డారు. వాళ్లకు ఓటేస్తే “ఎల్లమ్మ కూడ బెడితే.. మల్లమ్మ మాయం చేసింది’ అన్నట్లు ఈ పదేండ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతదని తెలిపారు. దివాకర్‌రావు లాంటి మంచి మనిషి గెలిస్తే తప్పకుండా మీకు లాభం జరుగుతుందన్నారు. ఆయన తన దగ్గరికి ఎప్పుడు వచ్చిన వ్యక్తిగతమైన పైరవీలు అడగలేదని, నాకు అంతర్గాం బ్రిడ్జి కావాలే.. నాకు గూడెం లిఫ్ట్ పక్కన ఇంకొక లిఫ్ట్ కావాలే.. పొలాలకు నీళ్లు కావాలే ఇవే మాట్లాడారు తప్ప ఎన్నడూ ఆయన పర్సనల్ పని అడగలేదన్నారు.
దయచేసి ఒక మంచి వ్యక్తి గెలిస్తే, మంచి వ్యక్తి ఆధ్వర్యంలో మంచిర్యాల ఉంటే మీకు అన్ని రకాల లాభం జరుగుతదన్నారు. మంచి ఎమ్మెల్యే గెలిస్తే మంచి గవర్నమెంట్ వస్తదని, చెడ్డ ఎమ్మెల్యే గెలిస్తే చెడ్డ గవర్నమెంట్ వస్తదన్నారు. మీరు తప్పకుండా ఇక్కడున్న అభ్యర్థుల గురించి ఆలోచించాలన్నారు. ఎవరు ఎలాంటోళ్లు అవకాశం ఇస్తే ఏం చేస్తరు.. నీతినిజాయితీగా ఎవరుంటరు.. గోల్మాల్ చేసేటోళ్లు ఎవరు.. ఇదంతా కూడా మీరు ఆలోచించాలని కోరారు. అంతకన్న ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల ఉన్న పార్టీలను, ఆ పార్టీల చరిత్ర, నడవడికను పరిగణిలోకి తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసమన్నారు.
రామగుండం పక్కన ముర్మూరులో ఉండే ఒక కవి తలాపునే పారుతుంది గోదారీ.. మన చేను, మన చెలక ఎడారీ.. అని పాట రాశారని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గోదావరి పక్కనే ఉంటాం కానీ చారడు నీళ్లు మన గడ్డ మీదకు రావన్నారు. కనీసం మంచినీళ్లు కూడా ఇయ్యలేకపోయారని, గోదావరి ఒరుసుకొని పారుతున్న ప్రాంతంలో కూడా సరైన మంచి నీరు అందించ లేక పోయారన్నారు. నీళ్ల కోసం గోస పడ్డాం అన్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, ఇక్కడ ఏం లేవని వలస పోవుడు చాలా భయంకరమైన బాధ కలిగిందన్నారు. వ్యవసాయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో.. పొద్దాక జెరంత కరెంట్.. తెల్లందాక జెరంత కరెంట్.
ఆడికి పోతే షాక్‌లు కొట్టి సచ్చిపోవుడు.. పాములు కరుసుడు చాలా బాధలు పడ్డామని గుర్తు చేశారు. ఆ బాధలన్నీ పోవాలని నిర్ణయం తీసుకొని నీటి తీరువాను రద్దు చేసుకున్నామన్నారు. మంచిర్యాలకు గూడెం లిఫ్ట్ ద్వారా నీళ్లు వస్తే, దానికి నీటి తీరువా లేదన్నారు. కడెం ప్రాజెక్టు నుంచి, గూడెం నుంచి వచ్చే నీటికి రూపాయి కూడా నీటి తిరువా లేదన్నారు. రైతులకు కరెంట్ చార్జీలు లేవని, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. దివాకర్‌రావును గెలిపిస్తే ఇవాళ ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్న రైతుబంధు రేపు ఎకరానికి రూ.16 వేలు ఇస్తామన్నారు.
24 గంటల కరెంట్ ఇట్లనే ఉండాలంటే దివాకర్‌రావును గెలిస్తేనే ఉంటుందన్నారు. ఎందుకంటే యుద్ధానికి వెళ్తున్నప్పుడు కత్తి ఒకని చేతుల పెట్టి.. యుద్ధం ఇంకొకడిని చేయమంటే నడుస్తదా.. అని ప్రశ్నించారు. ఎవడైతే మన కోసం యుద్ధం చేస్తడో వాని చేతికి కత్తి ఇచ్చి యుద్ధం చేయమనాలే.. కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకొకడిని చేయమంటే కాదు కదా.. అది ధర్మమైతదా.. ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ గెలిస్తేనే కదా అన్ని వచ్చేదన్నారు. అందుకని ఆగం కాకండి. ఆలోచించి ఓటు వేయండని చెప్పారు.
నిజాం కాలంలో 130 ఏండ్ల కింద ప్రారంభమైన కంపెనీ సింగరేణి అని సీఎం కేసీఆర్ అన్నారు. 100 శాతం అది మన రాష్ట్ర కంపెనీ అని మీ అందరికీ తెలుసునన్నారు. ఈ కాంగ్రెస్ దద్దమ్మలు రాజ్యం ఏలినప్పుడు.. వాళ్లకు చేతగాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి, 49 శాతం వాటా కేంద్రానికి ఇచ్చారన్నారు. అప్పు తిరిగి కట్టడం చేతగాకనే వాళ్లకు 49 శాతం వాటా పోయిందన్నారు. ఇంక వాని పుణ్యం 51 శాతమన్న ఉంచారని, ఆయింత అది కూడా పోతే ఒడిసే పోతుండే అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూనియనోళ్లు, సీపీఐ పార్టీలకు సంబంధించిన యూనియనోళ్లు మొత్తం అన్ని యూనియనోళ్లు కూడబల్కొని డిపెండెంట్ ఉద్యోగాలకు మంగళం పాడారన్నారు. మీ అందరికీ తెలుసు సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టింది ఈ పార్టీల యూనియనోళ్లే.. అది తక్కువ, ఇది తక్కువ అని తిరుగుతున్న ఈ యూనియన్లే.
ఆ రోజు ఉద్యోగాలు ఊడగొట్టినయ్ కదా అని మండిపడ్డారు. మళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించుకున్నామన్నారు. 15 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నామని, ఎవలన్న ఉద్యోగం తీసుకోకపోతే వాళ్లకు రూ.25 లక్షలు ఇస్తున్నామన్నారు. సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకుంటే రూ.10 లక్షలు ఇచ్చి, వడ్డీలేని రుణం ఇస్తున్నామన్నారు. సింగరేణి కార్మికులు దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు ఉంటరని, వాళ్లకు ఇన్‌కం ట్యాక్స్ మాఫీ చేయమని నరేంద్ర మోదీకి అసెంబ్లీలో తీర్మానం చేసి ఎప్పుడో పంపించిన, ఆ మోదీ చేస్తలేడన్నారు. ఇవాళ బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ ఒకరు నిలబడ్డారని, దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే, నీను ఒక 100 ఉత్తరాలు రాసిన మోదీ ఒక్క మెడికల్ కాలేజీ తెలంగాణకు ఇయ్యలేదన్నారు. చట్టం ప్రకారం జిల్లాకు నవోదయ పాఠశాలలు ఇవ్వాలని ఉన్నా.. దాన్ని ఉల్లంఘించి మన రాష్ర్టానికి ఒక్క పాఠశాల కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ర్టానికి ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి మనం ఎందుకు ఓటు వేయాలి.. వాళ్లు ఏ ముఖం పెట్టుకొని మనల్ని ఓటు అడుగుతున్నరో ఆలోచించాలన్నారు.
బీజేపీకి వేస్తే ఆ ఓటు మోరిలో పారేసినట్లేనని, ఆ ఓట్లు ఏవో దివాకర్‌రావుకు వేస్తే మీకు మంచి పనులు జరుగుతాయన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటా, దసరా, దీపావళి బోనస్ రూ.1000 కోట్లు పంచినమన్నారు. ప్రతి కార్మికుడికి దగ్గర దగ్గర రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షలు వచ్చినయన్నారు. గతంలో ఓన్లీ 16 శాతం వాటా ఇస్తే లాభాల్లో.. ఇవాళ మనం 32 శాతం ఇచ్చుకుంటున్నామన్నారు. కార్మికుల హక్కులు కాపాడుతున్నది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని, ఇవన్ని కూడా మీరు దృష్టిలో ఉన్నాయని చెప్పారు. దివాకర్‌రావు గెలుపు కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్‌రావు, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, డీసీఎంఎస్ చైర్మన్ లింగన్న, మాజీ మంత్రి బోడ జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.