బేల, జూన్ 18 : ఓ వైపు పాఠశాలలన్నీ ప్రారంభమై పాఠ్యాంశాల బోధన కొనసాగుతుండగా బేల మండలంలోని దహెగావ్లోని ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక, విద్యార్థులు రాలేక తరగతి గదులకు తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే బేలలోని ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాలలో కూడా ఒకే టీచర్‌తో బోధన కొనసాగకపోవడంతో మా పిల్లల చదువులు ఎలా సాగుతాయని అధికారులపై తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నారు.
బేల మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో దాదాపు 103 మంది విద్యార్థులు 10 తరగతి వరకు ఉన్నారు. కనీసం ఆరుగురు ఉపాధ్యాయులకు ఒకే ఉపాధ్యాయురాలు ఉన్నది. దహేగావ్ గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో 20 నుంచి 35 మంది విద్యార్థులున్నారు. కనీసం ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా ఒక్కరూ లేక కూడా లేరు. దీంతో మరాఠీ మీడియం ఉపాధ్యాయురాలిని మండల విద్యాధికారి డిప్యూటేషన్‌పై నియమించారు.
ఉర్దూ పాఠాలను మరాఠీ భాష ఉపాధ్యాయురాలు బోధించలేని పరిస్థితి నెలకొన్నదని, దీంతో పిల్లలు బడికి వెళ్లడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. బడిలో ఉండాల్సిన పిల్లలు వాగులు వంకల చుట్టూ తిరుగుతున్నారని, బడి ప్రారంభమై వారం రోజులైనా ఉర్దూ ఉపాధ్యాయులను నియమించకపోవడంపై తలిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్, డీఈవో స్పందించి ఉర్దూ మీడియం పాఠశాలలో తరగతులు ప్రారంభించేలా చూడాలని కోరుతున్నారు.
ఈ విషయమై మండల విద్యాశాఖ అధికారి కోల నర్సిహుంలును వివరణ కోరగా వాస్తవానికి బేలలో ఉన్న రెండు ఉర్దూ మీడియం పాఠశాలల్లో దాదాపు 130 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఉర్దూ మీడియం సంబంధించి టీచర్ ఒకరు, మరొకరు డిప్యూటేషన్ ఉండడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై డీఈవో దృష్టికి తీసుకెళ్లామని, వారం రోజుల్లో సమస్య పరిషారం కావచ్చని తెలిపారు.