నిర్మల్ టౌన్, మార్చి 4 : సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు నిర్మల్ ప్రాంత చరిత్ర తెలుసుకోవాలని, ఇక్కడ విభిన్నమైన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన పెంచుకునేందుకు ఈ పర్యటన దోహదపడాలని పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ ద్వారా ఎంపికైన ఉద్యోగులకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణలో భాగంగా శనివారం నిర్మల్ జిల్లాకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. మొదట కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సర్వీసెస్ అధికారులతో కలెక్టర్ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ ఉద్యోగం ఎంతో ప్రాధాన్యతతో కూడినదన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నదని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు, ప్రజల జీవన విధానం, ఈ ప్రాంతం ప్రత్యేకత, తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లాపరంగా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద సివిల్ సర్వీసెస్ ఉద్యోగులతో ఫొటోలు దిగారు.
పదో తరగతి ఫలితాల్లో ముందుండాలి
వచ్చే నెలలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో నిర్మల్ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులే ఫలితాల్లో ముందుండాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని చాణక్య డిగ్రీ కళాశాలలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, సంసిద్ధతపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి పదో తరగతి ఎంతో కీలకమన్నారు. ఉపాధ్యాయులు చెప్పిన అంశాలను గుర్తించుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం అందిస్తున్నదని పేర్కొన్నారు. పరీక్షలంటే భయం వీడినప్పుడే మంచి మార్కులు సాధించగలుగుతామన్నారు. అనంతరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ అధికారి లోకేశ్, బీసీ సంక్షేమ అధికారులు ఖాలిక్, సృజయ్, నాగరాజు, గంగాధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ అడెల్లి మహాపోచమ్మ ఆలయంలో చారిత్రాత్మకంగా వెలిసిన అడెల్లి పోచమ్మ గర్భగుడి విగ్రహాన్ని మార్చవద్దని అడెల్లి గ్రామస్తులు కలెక్టర్ వరుణ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.