మంచిర్యాల, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సింగరేణి బాంబులతోనే చెన్నూర్ శనగకుంట మత్తడిని పేల్చివేశారని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే వివేక్ స్వయంగా మాట్లాడిన ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో సారాంశంలో మత్తడి ధ్వంసానికి కారణమైన కాంగ్రెస్ నేతలను రక్షించే విధంగా ఉందని చెన్నూర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణిలో ఉపయోగించే బాంబుల కారణంగానే పేలుడు జరిగిందని స్పష్టంగా ఎమ్మెల్యే వివేక్ చెపుతుండగా, బాంబులను బయటకు తీసుకొచ్చిన ఆ సింగరేణి ఉద్యోగి ఎవరనేది తేల్చాల్సి ఉంది. సింగరేణి నుంచి ఆ బాంబులు ఎలా బయటకు వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? సింగరేణి సంస్థలోని గనులు, ఓపెన్ కాస్ట్‌లలో ఈ బాంబులను వినియోగిస్తుంటారు.
ఈ బాంబులు బయటకు రావడం అంత సులభం కాదు. కానీ.. చెన్నూర్ మత్తడి పేల్చివేతకు అంత సులభంగా తీసుకొచ్చిన ఉద్యోగి ఎవరు? ఈ పేల్చివేతకు ఉపయోగించిన బాంబులను సరఫరా చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాలి. చెరువు బఫర్ జోన్లో మట్టిని పోసిన ఒక కాంగ్రెస్ నాయకుడి దగ్గరి బంధువు ఆర్కే ఓసీపీలో పని చేస్తున్నట్లు సమాచారం. కాగా.. సింగరేణి బాంబులతోనే మత్తడి పేల్చినట్లు ఎమ్మెల్యే వివేక్ చెపుతుండగా, కాంగ్రెస్ నాయకుడి బంధువు అయిన సింగరేణి ఉద్యోగి ద్వారానే ఈ బాంబులు సరఫరా జరిగినట్లుగా తెలుస్తున్నది. కాగా.. రా్రష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ మత్తడి పేల్చివేత కేసును పోలీసులు ఏ రకంగా క్లోజ్ చేయనున్నారు? బాధ్యులపైన చర్యలు ఉంటవా? ఉండవా? అని తేలాల్సి ఉంది.
కాంగ్రెస్ నాయకులను తప్పించడం పక్కానా?
శనగకుంట మత్తడి పేల్చివేత వ్యవహారంలో కాంగ్రెస్ నాయకులను తప్పేంచేందుకు అధికార పార్టీ నాయకులు సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ వ్యవహారంలో నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా.. ఇందులో చెన్నూర్ మున్సిపల్ కౌన్సిలర్ భర్తతోపాటు మరో ముగ్గురిని అరెస్టు చూపారు. శనగకుంట బఫర్ జోన్లో మట్టి పోయడంతోనే చెరువు నీరు తమ కాలనీలోకి రావడం వల్లే పేల్చినట్లు పోలీసులు చెప్పగా.. కేసు విచారణలో కీలక వ్యక్తులను పోలీసులు పక్కన పెట్టినట్లు సమాచారం.
చెరువు బఫర్ జోన్లో మట్టిపోసినట్లయితే లబ్ధిపొందేది కాంగ్రెస్ నేత అయిన బాపురెడ్డి కాగా కీలక కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు మంచిర్యాల జిల్లా ప్రజలు గుసగుసలాడుతున్నారు. కాగా.. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ విడుదల చేసిన వీడియోలో ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న ఇతర పార్టీ నేతలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించడంపై పలు అనుమానాలు వెలువడుతున్నాయి.
మత్తడి పేల్చివేతలో ప్రధానంగా లబ్ధిపొందే నేతలు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఎమ్మెల్యేకు తెలిసినా ఇతర పార్టీ నేతలను పట్టించి చేతులు దులుపుకునే పరిస్థితి చేస్తున్నట్లు చెన్నూర్ ప్రజలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే చెప్పినట్లు 24 గంటలలోగా ఈ కేసును ముగించినట్లయితే మత్తడి పేల్చివేత వ్యవహారం పక్కదారి పట్టే అవకాశం కనిపిస్తున్నది.
కాంగ్రెస్ నాయకులను క్లీన్‌చీట్ ఇచ్చి, ఇతర పార్టీ నాయకులను బలిచేయడానికే ఎమ్మెల్యే వివేక్ తన వీడియో ఎక్కడ కూడా సొంత పార్టీ నాయకులకు సంబంధం ఉంది అని చెప్పలేదని స్పష్టం అవుతుంది. ఇటీవల చెన్నూర్‌లో ఎమ్మెల్యే వివేక్ పర్యటించినప్పటికి మత్తడి పేల్చివేతకు కారణమనే టాక్ వినిపిస్తున్న నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కాగా.. వీరి అలకకు దిగి వచ్చి ఎమ్మెల్యే వివేక్ సొంత పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ఈ వీడియో విడుదల చేసి హడావుడిగా కేసు ముగించనున్నారా? అని పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రిలయన్స్ మార్ట్, ట్రెండ్స్‌కు తాళం వేసిన పోలీసులు
శనగకుంట మత్తడి పేల్చివేత కేసు నేపథ్యంలో చెన్నూర్ మున్సిపల్ కౌన్సిలర్‌కు చెందిన భవనంలో రిలయన్స్ మార్ట్, ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. ఆ భవనాలకు చెన్నూర్ పోలీసులు తాళం వేశారు. కాగా.. పోలీసులు మాల్స్‌కు తాళం వేయగా చెన్నూర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకున్నది. తప్పుచేసినట్లు రుజువయితే అరెస్టులు చేయకుండా ఇలా షాప్స్‌కు తాళాలు వేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న చెన్నూర్‌లో వరుసగా జరుగుతున్న ఘటనలతో పట్టణ ప్రజలలో అభద్రతా భావం నెలకొంటుంది. కొంతమంది నాయకులు కావాలనే ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు కొంత కాలంగా కుట్రలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ కేసు విషయంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కలుగజేసుకుని హడావుడిగా కేసుకు ముగింపు పలకకుండా కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపి, కాల్ డాటా ఆధారంగా విచారణ జరిపి మత్తడి పేల్చివేతకు కారణమైన ప్రధాన దోషులను పట్టుకోవాలని చెన్నూర్ ప్రజలు కోరుతున్నారు.