ఖానాపూర్, ఏప్రిల్ 4 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక శనివారం రసాభాసగా మారింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా.. ఎన్నికల సంఘం ఆదేశాలతో శనివారం ఐటీడీఎ ఇన్చార్జి పీవో యువరాజ్ మర్మాట్, ఎన్నికల ప్రత్యేకాధికారి జీవరత్నం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. మొదటగా ముగ్గురు బీఆర్ఎస్, నలుగురు బీజేపీ సభ్యులు హాజరయ్యారు. అనంతరం ఎక్స్ అఫిషియో సభ్యుడైన ఎమ్మెల్యే బొజ్జు పటేల్సహా మిగతా ఐదుగురు సభ్యులు ఎమ్మెల్యే వాహనంలో వచ్చారు.
ఇదివరకు ప్రమాణ స్వీకారం చేయని ఎనిమిది మంది సభ్యులతో ఎన్నికల అధికారి జీవరత్నం ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం 12ః30 గంటలకు నిర్వహించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు 12 వార్డు సభ్యులతో సహా ఎక్స్ అఫిషియో సభ్యుడితో 13 మంది ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. చైర్మన్ పదవి ఏడుగురు సభ్యుల బలం ఉంటే సరిపోతుంది. ఖానాపూర్ మున్సిపాలిటీలోని 12 వార్డులలో బీఆర్ఎస్ నలుగురు, బీజేపీ నలుగురు, కాంగ్రెస్ ముగ్గురు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించారు.
ఫిబ్రవరి 16వ తేదీన నిర్వహించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి ముగ్గురు సభ్యులు, ఒక స్వతంత్ర అభ్యర్థి హాజరై ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి రోజు కోరం లేకపోవడంతో మరుసటి రోజు నిర్వహించిన ఎన్నికకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు హాజరు కాకపోవడంతో అధికారులు మరోసారి వాయిదా వేశారు.

రా ష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో శనివారం మరోసారి ఎన్నికను నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలో ఎన్నిక సమయం దగ్గర పడడంతో బీఆర్ఎస్ క్యాంపు నుంచి ఐదో వార్డు కౌన్సిలర్ మైస పోశాని అదృశ్యం కావడంతో బీఆర్ఎస్ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ పోశాని కాంగ్రెస్ క్యాంపులోకి వెళ్లడంతో ప్రజాస్వామ్య రక్షణకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ఒక్కటయ్యేందుకు సిద్ధమైనట్లు అయా పార్టీల నేతలు ప్రకటించారు.
మొదటగా ఎన్నికల నిబంధనల ప్రకారం చైర్మన్ ఎ న్నికల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ నుంచి చిన్నం సత్యనారాయణను కాంగ్రెస్ సభ్యులు, బీజేపీ నుంచి అంకం మౌనికను బీఆర్ఎస్ సభ్యుడు తాళ్లపల్లి రాజగంగన్న, బీజేపీ అభ్యర్థి సత్యవతి ప్రతిపాదించి బలపరిచారు. తర్వాత అక్షర క్రమంలో బీజేపీ అభ్యర్థి మౌనికకు మద్దతిచ్చే సభ్యులు చేతులు పైకి ఎత్తాలని అధికారులు సూచించడంతో బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు మౌ నికసహ ఏడుగురు మద్దతు ప్రకటించారు.

అనంతరం చిన్నం సత్యనారాయణకు మద్దతిచ్చే అంశంలో కౌన్సిల్లో రసాభాస ఏర్పడింది. తమదే పైచేయి అయిందని కాంగ్రెస్ సభ్యులు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అధికారులతో సీసీ పుటేజీ పరిశీలించాలని వాగ్వాదానికి దిగారు. ప్రత్యేక సమావేశంలో తీవ్ర గందరగోళం మధ్య చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించి వెళ్లిపోయారు. అనంతరం కార్యాలయం నుంచి ఎమ్మెల్యే బొజ్జు పటేల్సహా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ పార్టీ మద్దతు కౌన్సిలర్లు బయటకు వెళ్లారు.
ఆగ్రహించిన బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వైఖరి నిరసనగా ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు కౌన్సిల్లో బైఠాయించి నిరసనకు దిగారు. వీరికి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షు డు రితీష్ రాథోడ్ మద్దతుగా గళం వినిపించారు. ఈ క్రమంలోనే బీజేపీ కౌన్సిలర్ బొప్పారపు సత్యవతి సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను హుటాహుటిన 108లో ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడినట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ఉప్పెనలా మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన శ్రేణులను అడ్డుకోవడంలో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో వారిని అడ్డుకొనే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు. ముందు నుంచే ఏఎస్పీ సాయికిరణ్, ఉపేందర్రెడ్డిల నేతృత్వంలో ఖానాపూర్‌లో భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. ఈ క్రమంలో ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.
అప్రజాస్వామిక విధానాలతో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి నేటికి ఎన్నిక వాయిదా పడేలా చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునిచ్చాయి. నేడు ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో జరుగనున్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగనున్న నేపద్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పరిశీలకులుగా మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మె ల్యే నడిపల్లి దివాకర్ రావు వస్తున్నారని పార్టీ శ్రేణులు తెలిపాయి. నేడు జరగనున్న ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఖానాపూర్ తరలిరావాలని కోరారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడమే కాకుండా.. పూర్తిస్థాయి కోరం ఉన్నా ఎన్నికను వాయిదా వేయించడం కచ్చితంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు.

ఎన్నికలను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో అధికారులు సభ్యులకు చెప్పకపోవడం విడ్డూరమన్నారు. మళ్లీ నిర్వహించే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికకు మా ఏడుగురు కౌన్సిలర్లు హాజరవుతారని పేర్కొన్నారు. అనంతరం నిర్మల్ తరలివెల్లిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికపై పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్‌కు అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికార బలంతో ఎన్నికల అధికారులను భయభ్రాంతులకు గురి చేసి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను వాయిదా పడేలా చేశారని బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఎన్నిక వాయిదా అనంతరం కౌన్సిలర్లు తాళ్లపల్లి రాజగంగన్న, షోయెబ్, ఇందిర, అంకం మౌనిక, గాడ్పు అశోక్, బొప్పారపు సత్యవతి, బండిపెల్లి సిందూజ పోడియం ఎదుట బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యుడి హోదాలో హాజరైన ఎమ్మెల్యే ఓటమి భయంతో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నిక వాయిదాకు పట్టుబట్టారని పేర్కొన్నారు. ఓటమిని జీర్ణించుకోక ఎమ్మెల్యే టేబుళ్లను చిందర వందర చేయడంతో ఎన్నికల అధికారులు బయపడి ఎన్నికను వాయిదా వేశారన్నారు. తామందరం కలిసి బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనికకు మద్దతు ప్రకటించి చేతులు పైకి ఎత్తి చైర్మన్‌గా మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. అధికారులు మౌనిక గెలిచినట్లు ప్రకటించడం కూడా జరిగిందన్నారు. ఇప్పటికైన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యం అపహస్యం కాకుండా చూడాలని కోరారు.