మంచిర్యాల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్తగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు పశ్చిమ జిల్లాలోని నాయకులకే మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ సర్కారు కూడా అడుగులు వేస్తుందని పలువురు నాయకులు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. తూర్పు జిల్లాగా ఉన్న మంచిర్యాలలో ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచే ఉన్నారు. పశ్చిమ జిల్లాలో ఒక్క ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇస్తారనే చర్చ నడిసింది.
మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.. ముగ్గురికి ముగ్గురు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు అధిష్టానంపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. మా ఎమ్మెల్యేకే మంత్రి పదవి అంటే.. కాదు కాదు.. మా ఎమ్మెల్యేకే.. అంటూ కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు ప్రచారాలు చేసుకుంటున్నారు. కాగా, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను కాదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పేరును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పరిశీలిస్తున్నట్లు సమాచారం. అటు మంత్రి సీతక్కకు, ఇటు సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన సన్నిహితంగా మెదులుతుండడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నది. అదే జరిగితే.. ఉమ్మడి జిల్లాలో మేమే కాంగ్రెస్ పార్టీకి దిక్కు అని చెప్పుకుంటున్న తూర్పు జిల్లా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటన్నది అగమ్యగోచరంగా మారింది.
ఎమ్మెల్యేల పోటీ.. మంత్రులకు తలపోటు..
మంచిర్యాల జిల్లాలో ముగ్గురికి ముగ్గురు ఎమ్మెల్యేలు సీనియర్లు కావడం, మంత్రి పదవికి ఎవరి స్థాయిలో వారు పోటీ పడుతుండడం అటు కాంగ్రెస్ అధిష్టానానికి, ఇటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తలనొప్పిగా మారిందని కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. జిల్లాలో జరుగుతున్న వరుస పరిణామాలు ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విబేధాలను బయటపెడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన సమయంలో చెన్నూర్ నియోజకవర్గంలోనూ పర్యటిస్తారని అంతా అనుకున్నారు. ఆ రోజు అర్ధాతరంగా పర్యటనను రద్దు చేసుకొని పెద్దపల్లి జిల్లాలో మాత్రమే పర్యటించి వెనుతిరిగారు.
దీనికి పీఎస్సారే కారణమనే చర్చ అప్పట్లో నడిసింది. పైగా ఆ రోజు పెద్దపల్లిలో జరిగిన మీటింగ్‌లో మంత్రి శ్రీధర్‌బాబు సైతం పీఎస్సార్ సేవలను పార్టీ గుర్తించిందని, ఆయన నాయకత్వంపై నమ్మకం ఉందంటూ ప్రకటించారు. దీంతో పీఎస్సార్‌కు మంత్రి పదవి పక్కా అని సోషల్ మీడియాతో పాటు కాంగ్రెస్ నాయకులు కోడై కూశారు. దీనికి చెక్ పెడుతూ.. ఇటీవల గడ్డం వెంకటస్వామి(కాక) జయంతిని ఈసారి గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కాక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కీలక భాగస్వాములను చేయాలని నాయకత్వం భావిస్తుందంటూ ప్రకటించారు. దీంతో పీఎస్సార్ ఆశలు గల్లంతు కాగా, వివేక్ లేదా వినోద్లకు మంత్రి పదవి ఇస్తారనే చర్చ కొన్ని రోజులు జిల్లాలో నడిసింది. ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పక్క జిల్లా మంత్రులు ఎమ్మెల్యే పీఎస్సార్‌కు అనుకూలంగా ఉంటే, ముఖ్యమంత్రి రేవంత్ కాక కుటుంబంవైపు చూస్తున్నట్లు ఈ రెండు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
గొడవ లేకండా ఆదివాసీ పేరు తెరపైకి..
డిసెంబర్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పీఎస్సార్‌కు మంత్రి పదవి ఇస్తే.. అటు కాక కుటుంబంతో, ఆయన్ని కాదని కాక కుటుంబ సభ్యులకు ఇస్తే పీఎస్సార్‌తో ఇబ్బందులు తప్పవని, మంత్రులతో పాటు ము ఖ్యమంత్రి మధ్యన ఈ వ్యవహారం చిచ్చు పెట్టొచ్చని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు వీరికి చెక్ పెట్టేలా మంత్రులందరూ ఆమోదించేలా ఆదివాసీ జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ నుంచి వెడ్మబొజ్జుకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పటికే పీఎస్సార్‌కు, గడ్డం సోదరులకు చేరవేసినట్లు సమాచారం.
మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలున్న నేపథ్యంలో వెడ్మ బొజ్జుకు ఇస్తే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆదివాసీలు పార్టీని అంటిపెట్టుకొని ఉంటారని, రాజకీయంగా మరింత బలపడొచ్చని పార్టీ భావిస్తుందట. సీనియర్లకు మంత్రి పదవి కాకుండా ఒకరికి ఆర్డీసీ చైర్మన్, మరొకరికి ప్రభుత్వ విప్ ఇస్తామనే ప్రపోజల్ పెట్టినట్లు ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండే నాయకులు చెబుతున్నారు. మంత్రి పదవి ఎక్కడ రాదోనని ఎమ్మెల్యేలు ఈ మధ్య హుషారుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, స్థానికంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం పనులకు కొబ్బరికాయలు కొట్టేస్తున్నారని ఆ పార్టీ లీడర్లే చెప్పడం గమనార్హం. పదవి రాకపోతే ఏం చేయలేమనే ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారని టాక్ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇది ఎటుపోయి ఎటు తిరుగుతుందో వేచి చూడాలి మరీ.