నిర్మల్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ) : త్వరలో జరగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నిక కోసం కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నట్లు పట్టభద్రులు పేర్కొంటున్నారు. ఆన్లైన్ ఎన్రోల్మెంట్లో సందేహాలు ఉన్నాయని, నివృత్తి చేసుకోవడానికి హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసినా పని చేయడం లేదని వాపోతున్నారు.
నవంబర్ 1, 2024 కంటే కనీసం మూడేండ్ల ముందు డిగ్రీ లేదా తత్సమానమైన డిప్లొమా పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అర్హులైన పట్టభద్రులు ఆఫ్‌లైన్‌లో ఎన్రోల్మెంట్ చేసుకోవడం వీలుకానప్పుడు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే చాలా మంది పట్టభద్రులు పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యేందుకు హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు. అలాగే కొంతమంది ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. అలాంటి వారు ఆఫ్‌లైన్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడం వీలుకాక, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ సంబంధిత రెవెన్యూ కార్యాలయాలకు వచ్చి అవసరమైన ఫారాలపై సంతకాలు చేయాలని అధికారులు పేర్కొంటుండడంతో దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు వ్యయ ప్రయాసాలకు ఓర్చి కేవలం సంతకం కోసం రావడం అంటే ఆర్థికంగా భారం కావడంతో ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఇష్ట పడడం లేదు. ఆన్లైన్లో ఒరిజినల్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా సంతకం చేయాలనడం, స్వయంగా వచ్చి సర్టిఫికెట్స్ చూపించాలని పేర్కొనడంతో ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ నత్తనడకన సాగుతున్నది.
ఇలా అయితే ఆఫ్‌లైన్ ఎన్రోల్మెంటుకు, ఆన్లైన్ ఎన్రోల్మెంటుకు తేడా ఏముందని పట్టభద్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులకు అవగాహన లేకపోవడం కొసమెరుపు. జిల్లా ఎన్నికల అధికారులు పట్టభద్రుల ఓటరు నమోదులో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేదంటే అర్హత ఉండి కూడా ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుందని గ్రాడ్యుయేట్స్ వాపోతున్నారు.
మా సొంతూరు సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామం. నేను ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నా. మొదటి సారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం వచ్చింది. ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు అన్ని ఒరిజినల్స్ అప్లోడ్ చేశా. అయినా ఓటరుగా నమోదు కావడం లేదు. మళ్లీ సొంత మండలానికి వచ్చి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సంతకాలు చేయాలంటున్నారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయించుకోవాలట.. ఉద్యోగానికి సెలవు పెట్టి 250 కిలో మీటర్లు ప్రయాణించి రావాలంటే కష్టమే. నేనే కాదు ఇలాంటి ఆంక్షలు పెడితే ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు.
– ఎం భోజరాజు, ఎంటెక్, జామ్, సారంగాపూర్ మండలం.