మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 24: మంచిర్యాల జిల్లా కేంద్రంలో చెడ్డీ గ్యాంగ్ దొంగలు బుధవారం తెల్లవారుజామున హల్చల్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి రెండుగంటల సమయంలో నస్పూర్‌లోని కలెక్టరేట్ ఏరియాలోని ఓ ఇంట్లో, మంచిర్యాలలోని భగవంతంవాడ ఏరియాలోని గోదావరివాడలో ఇంట్లో చొరబడి అకడ సెల్ ఫోన్, రూ.5 వేలను ఎత్తుకెళ్లారు.
అదే ఏరియాలోని మరో ఇంట్లో చోరీకి యత్నిస్తుండగా సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి దొరకకుండా దొంగలు పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోలు వైరల్ కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ విషయంపై మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్‌రావును వివరణ కోరగా ఈ ఘటన వాస్తవమేనన్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించినప్పటికీ దొంగలు దొరకలేదన్నారు. పట్టణంలో అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. రెండు సెల్ఫోన్లు చోరీకి గురైనట్లు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.