నిర్మల్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ దవాఖానలో యథేచ్ఛగా కడుపు కోతలకు తెగబడుతున్నాయన్న విమర్శలున్నాయి. మాఫియగా మారి అవసరం లేకున్నా బాధితులను భయపెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో ఆరోగ్యంతోపాటు, డబ్బులను కూడా నష్టపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 107 ప్రైవేట్ దవాఖానలు ఉండగా, దాదాపు 40 హాస్పిటళ్లలో కాన్పులు చేస్తున్నారు. ఆయా దవాఖానల్లో అత్యధికంగా సిజేరియన్లే చేస్తున్నట్లు సమాచారం. ఆయా దవాఖానల్లో ఎప్పుడో ఒకసారి నార్మల్ డెలివరీ చేస్తూ.. మిగతా రోజుల్లో సిజేరియన్లకే ప్రాధాన్యతనిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ప్రైవేట్ దవాఖానల్లో ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ వరకు 2,196 కాన్పులు జరుగగా, ఇందులో సాధారణ ప్రసవాలు 199 మాత్రమే ఉన్నాయి. మిగతా 1,997 ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరిగాయి. సాధారణ ప్రసవాలు చేయాలని అధికారులు ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేస్తున్నా..దవాఖానల నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవల నిర్మల్‌లోని డాక్టర్స్ లేన్‌లో గల ఓ దవాఖానలో సిజేరియన్ ద్వారా కాన్పు చేయించుకున్న మహిళకు తీవ్ర రక్తస్రావమై మరణించింది. ఆమె మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. సిజేరియన్ల సంఖ్యను తగ్గించడంతో మరణాలను అరికట్టవచ్చని గత కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ దవాఖానల్లో సకల సదుపాయాలను కల్పించింది. అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, కేసీఆర్ కిట్లను అందజేసి సిజేరియన్లకు అడ్డుకట్ట వేసింది. కాగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ మాఫియా మళ్లీ అడ్డగోలుగా కడుపు కోతలకు తెగబడుతుందన్న విమర్శలు ఉన్నాయి.
గతంలో నార్మల్ డెలివరీలే అధికంగా జరిగేవి. రానురాను పరిస్థితి దారుణంగా తయారైంది. ధనార్జనే ధ్యేయంగా డాక్టర్లు కాని వారు కూడా వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చేశారు. ప్రధాన పట్టణాల్లో కొంతమంది కోట్లాది రూపాయలను ఖర్చుచేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన డాక్టర్లను నియమించుకుని లక్షల రూపాయల జీతాలను చెల్లిస్తున్నారు. అధిక లాభాల కోసం ఆసుపత్రుల నిర్వాహకులు డాక్టర్లకు టార్గెట్లు పెడుతున్నారు. ఇందులో భాగంగానే సాధారణ ప్రసవానికి అవకాశాలు ఉన్నప్పటికీ, బాధితులను భయభ్రాంతులకు గురిచేసి సిజేరియన్ చేసుకునేందుకు ఒప్పిస్తున్నారు.
ప్రైవేట్ దవాఖానల్లో ఎక్కువగా సిజేరియన్లు చేస్తుండడంతో తల్లి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. సిజేరియన్ అంటే కచ్చితంగా కడుపుపై కోత పెట్టాల్సిందే. దీంతో అది మాని, సాధారణ స్థితికి రావడానికి కనీసం నెల నుంచి రెండు నెలల సమయం పడుతుంది. మందులు కూడా వాడాల్సి ఉంటుంది. వీటి ప్రభావం పుట్టిన శిశువుపై కూడా పడుతున్నది. తప్పనిసరిగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ ప్రసవాలతో పోలిస్తే సిజేరియన్లకు మూడింతలు వసూలు చేస్తారు. సాధారణ ప్రసావానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తుండగా, సిజేరియన్ ద్వారా కాన్పు చేస్తే రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు దండుకుంటున్నారు.
ప్రైవేటు హాస్పిటళ్లలో పరిస్థితి దారుణంగా ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొంత వరకు పర్వాలేదంటున్నారు. ప్రైవేట్‌తో పోలిస్తే ఇక్కడ సాధారణ ప్రసవాల సంఖ్య కొంత మెరుగ్గా ఉన్నది. నిర్మల్‌లో ప్రత్యేకంగా ప్రసూతి దవాఖాన కొనసాగుతుండగా, ఖానాపూర్, భైంసా పట్టణాల్లో ఏరియా దవాఖానల్లో ప్రసూతి విభాగాన్ని నిర్వహిస్తున్నారు. కాగా.. ఆయా హాస్పిటళ్లలో జరిగిన ప్రసవాల సంఖ్యను పరిశీలిస్తే.. ఈ ఏడాది 2,217 కాన్పులు కాగా, ఇందులో సాధారణ ప్రసవాలు 805 ఉన్నాయి. ఇక సిజేరియన్లు 1,412 ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రతి పదిలో ఆరు సిజేరియన్లు జరుగుతుండగా, నాలుగు నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. 2023 సంవత్సరంలో 5,742 కాన్పులు కాగా, ఇందులో సాధారణ ప్రసవాలు 1,999 ఉన్నాయి. సిజేరియన్లు 3,743 జరిగాయి. కేసీఆర్ ప్రభుత్వం సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని కఠిన ఆదేశాలివ్వడంతోనే ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితి మెరుగ్గా ఉందంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో 35-36 శాతం వరకు సాధారణ కాన్పులు జరుగుతుండగా, ప్రైవేట్‌లో మాత్రం 10 శాతానికి మించడం లేదు. దీనికి అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రైవేట్ హాస్పిటళ్ల నిర్వాహకులతో రెగ్యు లర్గా సమావేశాలు నిర్వహించి ప్రస వాలపై రివ్యూ నిర్వహిస్తాం. ఏ ఆసుప త్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగు తున్నాయో వాటిని గుర్తించి విచారణ నిర్వహిస్తాం. విచారణలో తప్పని తేలితే చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించని ఆసుపత్రులను సీజ్ చేసేం దుకు వెనుకాడం. ప్రభుత్వ దవాఖానలో సాధారణ ప్రసవాలకే ప్రయత్నించాలని వైద్యులకు, సిబ్బందికి ఆదేశాలిచ్చాం.
– డాక్టర్ రాజేందర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, నిర్మల్.